చిన్నారితో గది శుభ్రం చేయించడం దారుణం

DGP Gautam Sawang fires over Atmakur incident - Sakshi

ఆత్మకూరు ఘటనపై డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఆగ్రహం

చిన్నారి తండ్రిపై, ప్రేక్షక పాత్ర వహించిన హెడ్‌ కానిస్టేబుళ్లపై చర్యలు

సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని స్పాట్‌ వాల్యుయేషన్‌ గదిని చిన్నారితో శుభ్రం చేయించడం దారుణమని, బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలను తెలుసుకుని, బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

► గదిని శుభ్రం చేయాల్సిన తండ్రి తన 6 ఏళ్ల కుమార్తెతో గదిని ఊడిపించడం చాలా బాధాకరం. తండ్రి అయినప్పటికీ అతనిపై చట్టపరమైన చర్యలు తప్పవు. అక్కడే ఉన్న హెడ్‌ కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర వహించడం క్షమార్హం కాదు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఆ ఇద్దరిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించాం.  
► చైల్డ్‌ లేబర్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌–1986 ప్రకారం 14 ఏళ్లు నిండని బాల బాలికల చేత చాకిరీ చేయించడం నిషిద్ధం. సెక్షన్‌ 14 ప్రకారం శిక్షార్హం. పని చేయించిన వ్యక్తులకు కనీసం 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ. 10 వేల నుంచి 20 వేల వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది. 
► బాల బాలికలను ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించడం కూడా నేరమే అని తెలియచేసేలా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top