
ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లపై విద్యార్థుల ఫిర్యాదు
కలెక్టర్, సబ్ కలెక్టర్, విలేకరులకు లేఖలు రాసిన విద్యార్థులు
కొమరోలు: ప్రాక్టికల్స్, పరీక్షల్లో మార్కుల నెపంతో అధ్యాపకులు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించడం, బాలురతో మద్యం సీసాలు తెప్పించుకోవడం, నగదు వసూలు చేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్, సబ్ కలెక్టర్, విలేకరులకు లేఖల రూపంలో మొరపెట్టుకున్నారు.
ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొంతమంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న బైపీసీ విద్యార్థినులకు జరుగుతున్న ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయాలంటే తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు గురిచేస్తున్నట్టు లేఖలో ఆరోపించారు.
బాలురు అయితే మద్యం బాటిళ్లు, నగదు ఇవ్వాల్సిందేనని తేల్చిచెబుతున్నట్లు వాపోయారు. పబ్లిక్ పరీక్షల సమయంలోనూ అధ్యాపకులకు చేయి తడపాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఈ పరిణామాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.