ఆక్రమణలు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
స్థానికులతో మాట్లాడుతున్న ఆర్‌డీఓ, ఒంగోలు అర్బన్ తహసీల్దార్
గుడిసెలు వేసుకునేందుకు స్థలం వద్దకు చేరిన జనాలు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు అర్బన్ మండలం ముక్తినూతలపాడు సర్వే నంబర్ 186లో స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకునేందుకు పలువురు పేదలు శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులను తీసుకెళ్లి మరీ ఆక్రమణలు నిలువరించారు. అనంతరం ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీ ప్రసన్న ఆక్రమణలకు పూనుకున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముక్తినూతల పాడు సర్వే నంబర్ 186లో 12.80 ఎకరాల భూమి ఉందన్నారు. సీపీఐ నాయకులు దాదాపు 600 మందితో 1.20 ఎకరాల భూమిలో చిల్లచెట్లు తొలగించి అందులో తాత్కాలిక గృహాలు వేసుకునేందుకు ప్రయత్నించారన్నారు. తహసీల్దార్ పిన్నిక మధుసూదన్‌రావు తన సిబ్బందితో అక్కడికి చేరుకొని స్థలాన్ని పరిశీలించి సదరు భూమి ముక్తినూతలపాడు సర్వే నంబర్ 186లో 12.80 ఎకరాల భూమిగా గుర్తించారని చెప్పారు. ఆ భూమి గ్రామ ఎఫ్‌ఎల్‌ఆర్ దాఖలా ‘రైతు వారి ఇనామ్’గా నమోదైందన్నారు.
పట్టాదారు పేర్లు నమోదై 1981లో 12.80 ఎకరాల భూమి నుంచి ఎన్‌ఎస్‌పీ కాలువ కోసం 4.40 ఎకరాలు భూ సేకరణ ద్వారా సేకరించి 5 సబ్ డివిజన్స్‌గా విభజించినట్లు వివరించారు. పోలీసులు అడ్డుకోవడంతో సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో అక్కడి నుంచి సుమారు 400 మందితో పట్టణంలో ర్యాలీ నిర్వహించారన్నారు. ర్యాలీ తహసీల్దార్ కార్యాలయానికి నినాదాలతో చేరుకున్నారు. దీంతో సీపీఐ నాయకులతో చర్చలు జరిపిన ఆర్‌డీఓ లక్ష్మీ ప్రసన్న పట్టణంలో ఎవరికై నా ఇంటి స్థలాలు లేని లబ్ధిదారులు ఉంటే వారు సంబంధిత సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములు గుర్తించి వారికి నివేశన స్థలాలు కేటాయించే విషయంలో ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని చెప్పారు. సర్వే నంబర్ 186లోని భూమి విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత సీపీఐ ప్రతినిధులు ఈ నెల 17న ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్దకు వచ్చి తమ అనుమానాలు నివృత్తి చేసుకోవాలని నోటీసుల ద్వారా తెలియజేసినట్లు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు.
పోలీసులతో కలిసి ముక్తినూతలపాడు వెళ్లిన అధికారులు
సీపీఐ ఆధ్వర్యంలో ఇళ్లు వేసేందుకు ప్రయత్నించిన పేదలు
ఆక్రమణలు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు


