పచ్చాకు ముఠాలకు రక్షణ చట్టం కావాలి
● వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్
ఒంగోలు టౌన్: పచ్చాకు ముఠా కూలీలకు ప్రభుత్వం రక్షణ చట్టం తీసుకురావాలని, ప్రతిఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో కలిసి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పొగాకు పంటపై ఆధారపడి 60 లక్షల మంది రైతులు, 2 కోట్ల మంది కూలీలు, 85 లక్షల మంది బీడీ కార్మికులు, 75 లక్షల మంది వివిధ వ్యాపారాలు చేసేవారు కలిపి మొత్తం 4.5 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. వీరి ద్వారా వివిధ రూపాలలో భారీగా అమ్మకం పన్ను ప్రభుత్వానికి చేరుతోందన్నారు. పొగాకు ఎగుమతి ద్వారా ప్రభుత్వానికి గతేడాది 16,786 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని తెలిపారు. పొగాకు వలన ప్రభుత్వానికి ఇంత ఆదాయం రావడానికి కారకులైన ముఠా కూలీలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 1.50 లక్షల ఎకరాలలో పొగాకు పంట పండిస్తున్నారని తెలిపారు. 70 వేల మంది ముఠా కూలీలు నాలుగు నెలల పాటు ఆకు కొట్టి, అల్లి, క్యూరింగ్ చేసి, బేళ్లు కట్టే వరకు పనులు చేస్తున్నారని వివరించారు. అయినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. పనిచేస్తున్న క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రతి ఏడాది పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. కాళ్లుచేతులు పోవడం జరుగుతుందని చెప్పారు. పని చేయించుకునే రైతు మానవతా హృదయంతో సాయం చేయడం మినహా ప్రభుత్వాల నుంచి కనీస సాయం అందడం లేదన్నారు. కనీసం బీమా సౌకర్యమైనా కల్పించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో పార్లమెంటు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు కె.వెంకటేశ్వర్లు ఉన్నారు.


