సీపీఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్యతో డీఎస్పీ వాగ్వాదం
● జాతీయ రహదారిపై బైఠాయించిన మహిళలు
ఒంగోలు టౌన్: ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ నిరుపేద మహిళలు బూమిని ఆక్రమించుకున్న సమాచారం తెలిసిన వెంటనే డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వెంటనే భూమిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. భూమిని ఖాళీ చేసేందుకు మహిళలు ససేమిరా అంటూ మొండికేశారు. పోలీసులు మహిళలని కూడా చూడకుండా వారిని లాగిపడేసేందుకు ప్రయత్నించారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, సీపీఐ కార్యకర్తలు, నాయకుల నినాదాలతో నార్త్ బైపాస్ హోరెత్తింది. పోలీసుల వ్యవహార శైలిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుకు గుజ్జుల ఈశ్వరయ్యకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ మహిళలు, సీపీఐ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు.
కూటమి ప్రభుత్వం
ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు
● ీసపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు నివేశన స్థలాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నగరంలో 20 వేల మందికి నివేశన స్థలాలు ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాల్లో ఒక ఇటుక కూడా వేయలేదని చెప్పారు. ఒంగోలు నగరంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. నిరుపేదలకు నివేశన స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉంటే స్థలంలో ఉంటాం, లేకుంటే జైళ్లకు వెళ్తామని స్పష్టం చేశారు. నార్త్ బైపాస్ ఇనాం భూములను తక్షణమే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృదం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు, నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఎంఏ సాలార్, రామకృష్ణ, దాసరి అంజయ్య, మత్తన ఆంజయ్య, నూనె జగన్‌మోహనరావు, అనంతలక్ష్మి, కట్టా ఆంజనేయులు, నల్లూరి మురళి, మౌలాలీ పాల్గొన్నారు.


