
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో బోటు బోల్తా పడి 22 మంది మృతి చెందిన ఘటనకు తనను బాధ్యుడిని చేసి సస్పెండ్ చేయడంపై పర్యాటక శాఖ డిప్యూటీ మేనేజర్ వీవీఎస్ గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రమాదం జరిగినప్పుడు మెడికల్ లీవులో ఉన్నందున తనపై విధించిన సస్పెన్షన్ చెల్లదని పిటిషన్ దాఖలు చేశారు. తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జీవీ శివాజీ వాదనలు వినిపిస్తూ.. బోటు ప్రమాదానికి, పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పిటిషనర్ కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్‌లో ఉన్నారని వివరించారు.
ఘటన జరిగిన రోజు కూడా సెలవులోనే ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ ఉన్నతాధికారులకు తెలుసని.. అయినా కూడా పిటిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేశారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. కొద్ది నెలలుగా పిటిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నిర్లక్ష్యం వల్లే బోటు ప్రమాదం జరిగిందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా బోటు తిరుగుతోందని తెలిసినా పట్టించుకోలేదన్నారు. గంగరాజు సస్పెన్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.