రాష్ట్ర పరిశ్రమలకు కోవిడ్‌ ఉపశమన పాలసీ

Department of Industries Director Subramaniam Interview With Sakshi

లాక్‌డౌన్‌తో ఒక్క పరిశ్రమ కూడా మూత పడకూడదన్నదే లక్ష్యం

ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు వడ్డీ రాయితీ ప్రతిపాదన

సీఎం ఆదేశాలతో ప్రత్యేక పాలసీ రూపకల్పనలో పరిశ్రమల శాఖ

సాక్షితో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రమణ్యం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పరిశ్రమ కూడా లాక్‌డౌన్‌ వల్ల మూతపడకుండా ఉండేందుకు కోవిడ్‌ ఉపశమన పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రుణాలపై మారిటోరియం, వడ్డీ రాయితీలు, వైఎస్‌ఆర్‌ నవోదయం వంటి అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రమణ్యం ‘సాక్షి’కి వివరించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. 

► లాక్‌డౌన్‌ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి జరిగిన నష్టాన్ని మదింపు చేసి ఏ మేరకు ఆర్థిక సాయం అందించాలన్న దానిపై సీఐఐ, ఏపీ చాంబర్స్, ఫిక్కీ వంటి
పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో చర్చిస్తున్నాం. 
► కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలు ఇప్పటికే ప్రకటించిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆర్థిక సాయం ఇచ్చే
విధంగా కోవిడ్‌ ఉపశమన పాలసీని రూపొందిస్తున్నాం. 
► ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ, టెక్స్‌టైల్‌ రంగాలకు 5 శాతం వరకు వడ్డీ సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. 
► రాష్ట్రంలో సుమారు 1.07 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉండగా అందులో 10 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారు.

వినియోగించిన కరెంట్‌కే బిల్లు.. 
లాక్‌డౌన్‌ వల్ల విద్యుత్‌ సంస్థల సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి రీడింగ్‌ తీసే పరిస్థితి లేకపోవడంతో గడిచిన నెల బిల్లునే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది గృహ వినియోగదారులకు అనుకూలమైన నిర్ణయం కాగా పారిశ్రామిక యూనిట్లకు ఇబ్బందికరంగా పరిణమించింది. 
► గత నెల 22 వరకు యూనిట్లు రన్‌ కావడంతో విద్యుత్‌ వినియోగం భారీగా ఉంటుంది. కానీ ఇప్పుడు యూనిట్‌ నడవక ఇబ్బందులు ఉన్న సమయంలో గడిచిన నెలలో వచ్చిన బిల్లులు ఇప్పుడు చెల్లించలేమంటూ వివిధ పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. 
► అలాగే పరిశ్రమలు ప్రతీ నెలా చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ చార్జీలను కూడా ఎత్తి వేయాలని కోరాయి. 
► ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో పరిశ్రమలకు ఈ నెలలో వినియోగించిన విద్యుత్‌ ఆధారంగానే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 
► వినియోగించిన విద్యుత్‌ వరకు బిల్లులపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాం. స్థిర చార్జీల విషయంలో డిస్కంలతో చర్చిస్తున్నాం. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం
ప్రకటిస్తాం. 
► ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలకు ముడి సరుకు కొరత లేకుండా చూస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం.  

లాక్‌డౌన్‌ నుంచి 520 పరిశ్రమలకు మినహాయింపు 
ఇందులో అత్యధికంగా ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థలే 
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నుంచి 520 పారిశ్రామిక యూనిట్లకు మినహాయింపు ఇచ్చారు. అత్యవసర సర్వీసులు కింద ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో పాటు నిరంతరాయంగా పనిచేయాల్సిన పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు  సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందులో అత్యధికంగా 318 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు అనుమతులు ఇవ్వగా, 188 ఫార్మా, ఫార్మా ఉపకరణాల తయారీ సంస్థలు ఉన్నాయి. యూనిట్లను సగం సిబ్బందితో మాత్రమే నడపాలని, పనిచేసే చోట విధిగా భౌతిక దూరం పాటించాలని ఆదేశించినట్లు తెలిపారు. 

► పనిచేసే సంస్థలను పర్యవేక్షించే బాధ్యత ఏపీఐఐసీ జనరల్‌ మేనేజర్లది.  
► పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం.  
► సరుకు రవాణాకు సంబంధించి లాజిస్టిక్‌ అనుమతులు ఇచ్చాం.  
► ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో ఉత్పత్తి 40 నుంచి 45 శాతంగా జరుగుతోంది.  
► మొత్తం మీద చూస్తే రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి 25 శాతం వరకు జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top