జిల్లాకు ‘డెంగీ’ ఫీవర్ పట్టుకుంది. నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.
కంఠేశ్వర్,న్యూస్‌లైన్ : జిల్లాకు ‘డెంగీ’ ఫీవర్ పట్టుకుంది. నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. పారిశుధ్య లోపంతో ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుండగా, నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ నిర్ధారణ పరికరం ఉపయోగంలో లేకపోవడంతో రోగులు తప్పనిసరై హైదరాబాద్ తరలిపోతున్నారు. ఖరీదైన వైద్యం కావడం వల్ల జేబులు గుల్ల చేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 33 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.
మరో 10 కేసులు అనుమానాస్పదంగా ఉన్నాయి. నలుగురు మృతి చెందారు. అసలు వెలుగులోకి రాని కేసులు ఎన్నో ఉన్నాయి. తీవ్రంగా జ్వరం రావడం వంటి లక్షణాలను గుర్తించి ప్రైవేటు వైద్యులు రోగులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. చికిత్స చేయించుకొని ఇంటికి వస్తున్న ఇలాంటి వారు వైద్యశాఖ పరిగణనలో లేరు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉండగా, అధిక సంఖ్యలో పారిశుధ్యలోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. చాలా గ్రామాల్లో వర్షం నీరు నిలిచిపోయి మురికి గుంతలుగా మారాయి. చెత్త కుప్పలు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందాయి.వీటి నిర్మూలనకు శానిటేషన్ నిధులు పంచాయతీలకు అందుబాటులో లేవు. స్థానిక ఏఎన్‌ఎం, సర్పంచ్ జాయింట్ అకౌంట్‌కు మూడు నెలలకు ఒకసారి వైద్యశాఖ రూ.10 వేలు అందిస్తుంది. ఈ నిధులతో మురికి గుంతల్లో చల్లేందుకు బ్లీచింగ్ పౌడర్ వంటివి కొనుగోలు చేయాలి.
అయితే ఏఎన్‌ఎంలు, సర్పంచ్‌ల మధ్య సమన్వయం లేకపోవడంతో పలు పంచాయతీల్లో నిధులు మురిగి పోతున్నాయి. 2012-13 సంవత్సరానికి సంబంధించి 19 ఆరోగ్య కేంద్రాల్లో నిధులు మిగిలిపోయాయి. అంటే పారిశుధ్య నివారణ చర్యలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. గ్రామాల్లో ప్రజలకు వ్యాదులపై అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు. కనీసం కరపత్రాలు పంపిణీ చేయడం లేదు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి 2009 జూన్‌లో ప్లేట్‌లెట్ పరికరం(డెంగీ వ్యాధి నిర్ధారణ) మంజూరు అయ్యింది. రూ.10 లక్షలు వెచ్చించి తెచ్చిన పరికరం నాలుగేళ్లవుతున్నా ఉపయోగంలోకి రాలేదు. దీనికి సంబంధించిన టెక్నీషియన్లు లేకపోవడంతో వృథాగా పడిఉంది.
నిర్మూలన చర్యలు చేపడుతున్నాం....
-గోవింద్ వాగ్మారే, జిల్లా వైద్యాధికారి
డెంగీ వ్యాధి పట్ల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. వ్యాధి లక్షణాలు బయట పడిన ప్రాంతాల్లో రక్తపరీక్షలు నిర్వహస్తున్నాము. ప్రజలు భయపడవద్దు.