ఆ చిట్టితల్లికి ఎంత కష్టమో

Daughter cremation  to Mother dead body  - Sakshi

ఒంగోలు క్రైం: తండ్రి ఆలనలో.. తల్లి లాలనలో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన ఆ చిట్టితల్లికి తీరని కష్టం వచ్చి పడింది. ఆడుతూపాడుతూ కాలం గడపాల్సిన వయసులో తల్లికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకెళ్తే... కార్తీక వన మహోత్సవానికి ఆదివారం విజయవాడ వెళ్లి బోటు ప్రమాదంలో మృతిచెందిన వారిలో దేవాబత్తిన లీలావతికి ఆమె ఏకైక కుమార్తె మను మంగళవారం అంత్యక్రియలు నిర్వహించింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని మహా ప్రస్థానంలో బంధువులు దగ్గరుండి మనుతో లీలావతి మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. కొడుకైనా, కూతురైనా మను ఒక్కటే కావడంతో తానే కుమారుడి పాత్ర పోషించి తన పేగు బంధ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంది. 

ఈ సంఘటనతో చూపరులు సైతం కంట తడి పెట్టారు. ముంతను ఉట్టిలో పెట్టుకుని చేతపట్టి తల్లి మృతదేహం ముందు మను నడుస్తుంటే దారినపోయే వారు సైతం అయ్యో ఆ చిన్నారికి ఎంత కష్టమో.. అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లి మృతదేహం చుట్టూ ఆఖరి ప్రదక్షిణలు చేసే సమయంలో మనుకు అడుగులు ముందుకు పడలేదు. కానీ, తప్పేది లేదంటూ బంధువులు ఆమెతో బలవంతంగానే అడుగులు వేయించి అంత్యక్రియలు పూర్తిచేయించారు. సుమా రు రెండు గంటలపాటు ఆ చిన్నారి మహా ప్రస్థానంలో వెక్కివెక్కి ఏడ్చి చివరకు సొమ్మసిల్లి పడిపోవడంతో బంధువులు ఆమెను వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. 

ఏడేళ్ల వయసులోనే తండ్రి మృతి...
మనుకు ఏడేళ్ల వయసులోనే తండ్రి మరణించగా, తల్లి లాలనలో పెరుగుతూ ఇంటర్‌ పూర్తి చేసి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంతలో తల్లి లీలావతి బోటు ప్రమాదంలో మృతిచెందగా, ఆ బాధ తట్టుకోలేక అమ్మమ్మ లక్ష్మీకాంతం ప్రాణాలు విడిచింది. ఇలాంటి కష్టం ఏ చిట్టితల్లికీ రాకూడదని అంత్యక్రియలను చూసిన ప్రతిఒక్కరూ భగవంతుడిని కోరుకున్నారు.

Back to Top