దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు వెనుక..

Dasari, Harikrishna Statues Removed From Beach Road in Vizag - Sakshi

ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాల తొలగింపు వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆరోపించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌లు బీచ్‌ రోడ్‌లోని విగ్రహాలను సోమవారం అర్ధరాత్రి సమయంలో తొలగించారన్నారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా ఈ విధంగా చేయడం దారుణమన్నారు.


అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున, దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్‌.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను ఎన్నికల సమయంలో కలవడం, జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు ఈ కుట్రకు పూనుకొన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కొడుకుల మీద కోపంతో వారి తండ్రుల విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. అలాగే రాజన్న రాజ్యం రాబోతోందని, వైఎస్సార్‌ ఉన్నప్పుడు తెలుగు భాషకు ప్రాధాన్యం పెరిగిందని.. మళ్లీ జగన్‌ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను చెప్పానన్నారు. దీంతో చంద్రబాబు తనపైనా కోపం పెట్టుకొన్నాడని.. అందుకే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను కూల్చివేయించాడని మండిపడ్డారు.


బీచ్‌ రోడ్‌లో సినారే, అల్లు రామలింగయ్య, జాలాది, నేదునూరి కృష్ణమూర్తి, తిరుపతి వేంకట కవులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ తదితర విగ్రహాలు ఉన్నాయన్నారు. వాటికి కూడా ఎలాంటి అనుమతుల్లేవన్నారు. వాటిలో ఐదు విగ్రహాలను తానే ఏర్పాటు చేశానని చెప్పారు. వాటిన్నిటినీ వదిలేసి ఈ మూడు విగ్రహాలపైనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు కోర్టులో కేసు వేయాల్సి వచ్చిందో చెప్పాలని యార్లగడ్డ ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు వాటిని తొలగించడానికి ఎందుకు ఆదేశించారో చెప్పాలన్నారు. కాగా, విగ్రహాల ఏర్పాటుపై న్యాయస్థానం ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చినట్లు యార్లగడ్డ తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top