నేతకు అశ్లీల నృత్యాలు కావాలట | Dance Party on west godavari district leaders | Sakshi
Sakshi News home page

నేతకు అశ్లీల నృత్యాలు కావాలట

Sep 28 2014 2:18 AM | Updated on Mar 21 2019 7:25 PM

నేతకు అశ్లీల నృత్యాలు కావాలట - Sakshi

నేతకు అశ్లీల నృత్యాలు కావాలట

పబ్బాల పేరిట పల్లెటూళ్లల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించే మేళాలపై జిల్లా పోలీసులు చాన్నాళ్ల క్రితమే ఉక్కుపాదం మోపారు. అయినా సరే, ఖాకీల కళ్లకు గంతలు కట్టో.. పైరవీకారులకు

 పండగలు, పబ్బాల పేరిట పల్లెటూళ్లల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించే మేళాలపై జిల్లా పోలీసులు చాన్నాళ్ల క్రితమే ఉక్కుపాదం మోపారు. అయినా సరే, ఖాకీల కళ్లకు గంతలు కట్టో..  పైరవీకారులకు నోట్ల కట్టలు కొట్టో  కొన్నిచోట్ల అడపాదడపా అటువంటి మేళాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. అధికారం దన్నుతో కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న చందాన రెచ్చిపోతున్న ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఇలాంటి డ్యాన్స్ మేళాలు కావాల్సి వచ్చాయట. ఈ నెల తొలినాళ్లలో ముగి సిన వినాయకచవితి వేడుకల సందర్భంగా తన ఊళ్లో  మేళా పెట్టిస్తానంటూ చుట్టపక్కల భజనపరులకు, అనుయాయులకు ఆయన  హామీ ఇచ్చారు. ఆ మేరకు వాళ్లు పొరుగు జిల్లా నుంచి ఓ మాంచి డ్యాన్స్ పార్టీని  బేరమాడి కుదుర్చుకున్నారు.
 
 అంతా ఓకే.. ఇక ఆడటమే తరువాయి అన్న సమయంలో సరిగ్గా పోలీసులు రంగప్రవేశం చేసి ఇలాంటి డ్యాన్సులపై నిషేధం ఉంది కాబట్టి కుదరదని ఖరాకండిగా తేల్చేశారు. దీంతో సదరు అధికారపార్టీ నేత రంగప్రవేశం చేసి.. ఆ ఏరియా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ని పిలిచి.. నేను చూసుకుంటాను.. ఏమీ కాదులే.. మీ పై అధికారులతో నేను మాట్లాడతా అని ఒకింత దర్పం ప్రదర్శించి నచ్చజెప్పచూశారు. అయినా సరే ఆ సీఐ కుదరదని చెప్పడంతో.. నాతో పెట్టుకోవద్దు.. నా ఇగోను హర్ట్ చేసిన ఎస్సైను వీఆర్‌లో పెట్టించాను.. అని అరిచి ఆధిపత్యం ప్రదర్శించాలని చూశారట. అందుకు ఆ సీఐ... మరేం ఫరవాలేదు సర్.. నన్ను ఎక్కడికి బదలీ చేసినా వెళ్తాను.. చివరికి వీఆర్ అయినా ఓకే.. నా జీతం నాకు వస్తుంది.. ఉద్యోగం తీయలేరు కదా.. అని  మొహం మీద కటువుగానే సమాధానం చెప్పారట. సదరు నేత ఇంకేదో మాట్లాడుతూ ఆవేశంగా ఊగిపోతున్నా సీఐ చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయారు. వీరిద్దరి సంవాదం చూసి ఇక మేళా అయ్యే పనికాదని అనుచరులు ఎక్కడి వారు అక్కడ సర్దేసుకున్నారట. అప్పుడు ఆ సీఐ తెగువతో గండం గడిచినా ఇప్పుడు శరన్నవరాత్రి ఉత్సవాల పేరిట మళ్లీ డ్యాన్స్ మేళాలంటూ అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెడతారేమోనని పోలీసులు ఒకింత కంగారు పడుతున్నారట.
 
 ఇది కాటంనేని ముద్ర
 జిల్లాకు ఏ కలెక్టర్ వచ్చినా జిల్లాపై తనదైన ముద్ర వేయాలని యత్నించటం సహజం. పాలనలో తన మార్కు చూపించాలని తాపత్రయపడుతుంటారు. కానీ ప్రస్తుత కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాత్రం తనకు అటువంటి మార్కులు, ముద్రలు వద్దే వద్దని అంటున్నారు. ప్రచార ఆర్భాటాలు, హడావుడికి దూరంగా ముక్కుసూటిగా పనిచేసుకుపోతున్న కలెక్టర్ తానూ చాలా మందిలా ఓ గవర్నమెంట్ సర్వెంట్‌నేనని చెబుతున్నారు. ప్రజల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి.. ఆ పథకాల అమలులో లోటు లేకుండా ప్రతి ఒక్కరికీ అందించడమే అధికారుల ముందున్న పెద్ద లక్ష్యం. పాలకులు ఎవరైనా పాలనలో ప్రభుత్వ ముద్ర కనిపించాలి. అంతే కానీ వ్యక్తుల ప్రభావం ఏముంటుందన్నది కలెక్టర్ వాదన. అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పక్కదారి పట్టకుండా ప్రజలకు చేరవేయడమే ‘కాటంనేని’ ముద్ర అన్న మాట.
 
 ‘నానో’త్సాహం
 ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో దిగాలు చెంది.. అధికార పార్టీ నేతల అరాచకాలతో కుదేలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల్లో ఇప్పుడు ‘నానో’త్సాహం వెల్లివిరుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో పార్టీ జిల్లా సారథిగా బాధ్యతలు స్వీకరించిన ఆళ్ల నాని ఇటీవల జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సమావేశాలు పార్టీ శ్రేణుల్లో స్థరుుర్యాన్ని నింపాయనే చెప్పాలి. ఇందుకు ఇటీవల దెందులూరు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ సమావేశానికి వేలాదిగా కార్యకర్తలే కాదు స్వచ్ఛందంగా ప్రజలు, రైతులు తరలిరావడమే నిదర్శనమని అంటున్నారు. ప్రశాంత పశ్చిమగోదావరిగా పేరున్న ఈ జిల్లాకు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మాయనిమచ్చను తెస్తున్నాయి. అక్కడ అధికారపార్టీ నేతల ఆగడాలు, చిల్లర చేష్టల గురించి చెప్పుకుంటే కందిరీగల తుట్టెను కదలించినట్టే.
 
 అటువంటి నియోజకవర్గంలోని కూచింపూడి గ్రామంలో నిర్వహించిన సభకు జనం వెల్లువలా రావడం పార్టీ శ్రేణులకే ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి  దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన ఏ పార్టీ సమావేశాలైనా ఏలూరు నగరంలోనే నిర్వహిస్తుంటారు. కానీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వైసీపీ సభ ఆ నియోజకవర్గంలోనే నిర్వహించాలని పార్టీ జిల్లా సారథి ఆళ్ల నాని, పార్టీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిర్ణయించారు. ఆ సభకు పెద్దఎత్తున ప్రజలు, రైతులు రావడం, టీడీపీ శ్రేణుల అరాచకాలపై వైసీపీ నేతలు మాట్లాడినప్పుడు హర్షధ్వానాలు మిన్నంటడం పార్టీ శ్రేణుల్లో స్థరుుర్యాన్ని నింపింది. దెందులూరే కాదు.. సభలు జరిగిన అన్నిచోట్లా విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు ఇప్పుడు ‘నానో’త్సాహంతో ముందుకెళ్తున్నాయి.
 - సాక్షి ప్రతినిధి, ఏలూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement