అమాయకుల ప్రాణాలు బలి

Crackers Factory Owner Arrest In Without Licence - Sakshi

పేలుడు ప్రమాదం జరిగినా పట్టించుకోని వైనం

గతేడాది ప్రమాదంలో ఇద్దరు మృతి

లైసెన్స్‌ రద్దు చేసినా..మళ్లీ యథేచ్ఛగా బాణసంచా తయారీ

పోలీసులకు చిక్కిన తయారీదారుడు

తూర్పుగోదావరి, తుని : రాష్ట్రంలో ఏదో ఒకచోట బాణసంచా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది బతుకు దెరువు కోసం పనికి వెళ్లి ప్రాణాలను కోల్పోతున్నారు. అధికారులు అనుమతులను రద్దు చేసినా తయారీ మాత్రం ఆగడం లేదు. ఇటీవల రాజమహేంద్రవరం లాలాచెరువు వద్ద జరిగిన ప్రమాదంతో అధికారులు కళ్లు తెరిచారు. గతేడాది ఏప్రిల్‌ నాలుగున తుని ఇసుకలపేట వద్ద మందుగుండు తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలు పాటించని సంబంధిత తయారీ కేంద్రం అనుమతులను రద్దు చేయడంతో పాటు యజమానిపై కేసు నమోదు చేశారు. దీంతో బాణసంచా తయారీని తాత్కాలికంగా నిలిపివేశారు. తయారీదారుడు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో అధికారులు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావడంతో మళ్లీ బాణసంచా సామగ్రి తయారీ ప్రారంభించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు పట్టించుకోలేదు. ఆ వ్యాపారి మూడు తారాజువ్వలు, ఆరు చిచ్చుబిడ్లు అన్న చందాన వ్యాపారం చేస్తున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా అధికార పార్టీ చేసే కార్యక్రమాలకు తక్కువ ధరకు టపాసులను సరఫరా చేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు మౌనం వహించారు. ఇటీవల పట్టణ పోలీసుస్టేషన్‌కు చెందిన అధికారి ఒకరు తనిఖీ పేరిట వెళ్లి బెదిరించినా.. ఆ వ్యాపారి నుంచి నగదు తీసుకుని వదిలేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సోమవారం పట్టణ సీఐ వి.శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి పాత బజారు వీధిలో ఉన్న వ్యాపారి గోడౌన్‌పై దాడి చేశారు. సుమారు రూ.రెండు లక్షలు విలువ చేసే సామగ్రి సీజ్‌ చేసి, అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్న నిందితుడు చెల్లుబోయిన శ్రీను అరెస్ట్‌ చేశారు.

అనుమతి లేకుండా తయారీ
గతేడాది ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో శ్రీను బాణసంచా తయారీ చేస్తున్నారు. గణపతి నవరాత్రుల ముగింపు వేడుకలకు ఎక్కువ ఆర్డర్లు రావడంతో తారాజువ్వలు, అవుట్లు భారీగా తయారీ చేసి గోడౌన్‌లో నిల్వ చేశారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోలేదు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రమాదంతో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు సకాలంలో స్పందిస్తే ప్రాణ నష్టం జరగదని ప్రజలు అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top