సీపీఎస్‌ రద్దు చేయకుంటే పోరుబాటే

CPS employees protest for regular pension scheme - Sakshi

ఉద్యోగ సంఘాల ప్రతినిధుల స్పష్టం

కాకినాడలో ప్రదర్శన, భారీ బహిరంగ సభ 

ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికి ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా, ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, ప్రత్యేక ప్రయోజనాలు, సామాజిక భద్రతగా పింఛన్లు వస్తాయనుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోయింది. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగులను ఆందోళనలు, పోరాటాల బాట పట్టేలా చేసింది. 

కాకినాడ సిటీ: జిల్లా సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కాకినాడ మెక్లారిన్‌ హైస్కూల్‌ నుంచి భారీ ఊరేగింపుగా ఆనందభారతి గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని సీపీఎస్‌ ఉద్యోగులు వేలాదిగా తరలి వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానం కొనసాగించాలని నినదించారు. కమిటీలు వేసి ఉద్యోగులను బుజ్జగించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. పింఛన్‌ రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కు ఎక్కడిదంటూ ప్రశ్నించారు.

 శానససభలో పింఛన్‌ తీసేస్తున్నట్లు తీర్మానం చేసి కొత్త పింఛన్‌ విధానం అమలు చేస్తున్నట్లు చట్టాలు చేశారా అంటూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రత్యేక తీర్మానం ద్వారా సీపీఎస్‌ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సీపీఎస్‌ ఉద్యోగులు నిర్వహించిన సమరభేరి బహిరంగ సభకు ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రవికుమార్‌ అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా 
స్థాయి నాయకులు ఐ.వెంకటేశ్వరరావు, బూరిగ ఆశీర్వాదం, గొడుగు ప్రతాప్, డి.వెంకటరావు, ప్రదీప్‌కుమార్, ఎస్‌కేవీ భాషా, హృదయరాజు, మాజీ ఎమ్మెల్సీ 
నల్లమిల్లి శేషారెడ్డి, అంబాజీపేట ఎంపీడీఓ తూతిక 
విశ్వనాథ్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు.

సీపీఎస్‌ ప్రకటన ఇలా...
సీపీఎస్‌ విధానంపై 2003, డిసెంబర్‌ 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2004, జనవరి ఒకటి నుంచి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2004, సెప్టెంబర్‌ ఒకటి నుంచి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయ గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ పొందుతున్న సంస్థల్లో ఉద్యోగులు, అటానమస్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఉద్యోగులందరికీ 2004, నవంబర్‌ 22 నుంచి అమలు చేస్తోంది. దీనిని పెన్షన్‌ నిధి నియంత్రణ, అభివృద్ధి, ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ), నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌ అనే ప్రైవేటు సంస్థల సమన్వయంతో దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

సీపీఎస్‌ అంశం రాష్ట్ర పరిధిలోనిదే...
సీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమమే మొదలు పెట్టామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమైనందున దీనిని రద్దు చేయలేమని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయని, ఇది సరికాదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును కొన్ని రాష్ట్రాలు ఆమోదించిన తర్వాతే కేంద్రం అమల్లోకి తెచ్చిందన్నారు. ప్రస్తుతం త్రిపుర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా పాత పింఛన్‌ విధానమే అమల్లో ఉందన్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరినప్పుడు ఇది కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసినట్లు పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. సీపీఎస్‌ విధానం రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖల ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామన్నారు.

కేజ్రీవాల్‌ మాస్క్‌లతో...
ఆందోళనకారులు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫోటోలు, ఫ్లెక్స్‌లు, మాస్క్‌లు ధరించి పాల్గొనడం విశేషం. ఉద్యోగులకు ఆమ్‌ ఆద్మీ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నరాల శివ, మహిళా విభాగం కన్వీనర్‌ టి.రూపారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సీపీఎస్‌ రద్దుకు జగన్‌ సుముఖం : మార్గాని భరత్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజవర్గ కో ఆర్డినేటర్‌ మార్గాని భరత్‌ పేర్కొన్నారు. కాకినాడలో ఏపీ సీపీఎస్‌ జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో íసీపీఎస్‌ రద్దుపై నిర్వహించిన ర్యాలీ, సమరభేరి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా పర్యటన సమయంలో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేయడంతో పాటు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని, సకాలంలో కరువు భత్యం చెల్లిస్తామని జగన్‌ ప్రకటించారని భరత్‌ గుర్తు చేశారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలసి సీపీఎస్‌ విధానంపై చర్చించారని, స్పష్టమైన హామీని కూడా జగన్‌ ఉద్యోగులకు ఇచ్చారన్నారు. 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తుందని, సీపీఎస్‌ విధానం రద్దు అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌ సీపీకి ఓటు వేసి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మార్గాని భరత్‌ కోరారు. 

కేంద్రం జోక్యం అవసరం లేదు
ఇతర రాష్ట్రాలలో పాత పింఛన్‌ విధానం అమలు చేస్తున్నారు. మన ప్రభుత్వం మాత్రం కేంద్ర పరిధిలోనిదంటూ దాటవేస్తోంది. సీపీఎస్‌ను రద్దు చేసేందుకు కేంద్రం జోక్యం అవసరం లేదు.         
– భానుశ్రీ, కాకినాడ
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top