చలో అసెంబ్లీకి పిలుపు.. రాజధానిలో 144 సెక్షన్‌

CPS Employee Union Calls For Chalo Assembly - Sakshi

సాక్షి, విజయవాడ:  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యూనియన్‌ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. ప్రకాశం బ్యారేజీపై బైఠాయించారు. వందలసంఖ్యలో ఉద్యోగులు బ్యారేజీపై బైఠాయించి.. బ్యారేజీని దిగ్బం‍ధించారు. దీంతో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బ్యారేజీపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యోగులను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

‘చలో అసెంబ్లీ’కి  అనుమతి లేదంటూ.. ఉద్యోగులను అడ్డుకోవడానికి అడుగడుగునా పోలీసులు బలగాలను మోహరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సెక్షన్ 30తోపాటు 144  సెక్షన్ విధించారు. ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రకాశం బ్యారేజితోపాటు పలుచోట్ల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు తనిఖీ చేసిన తర్వాతే అసెంబ్లీలోకి సిబ్బందిని, ఇతరులను అనుమతించారు. మరోవైపు విజయవాడలో సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత..
చలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలిరావడంతో ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారేజీని దిగ్బంధించి.. ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీతోపాటు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసిన పోలీసులు.. ‘చలో అసెంబ్లీ’కి తరలివస్తున్న ఉద్యోగులను పెద్దసంఖ్యలో అరెస్టు చేస్తుండటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top