
డిమాండ్లపై హామీ లేని జేఎస్‌సీ భేటీ
నిరాశతో వెనుదిరిగిన సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం నుంచి తీపికబురు వస్తుందని ఆశించిన ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత ఎన్నో ఆశలతో బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్‌సీ) సమావేశంలో ఏ సమస్యపైనా ఉద్యోగులకు స్పష్టమైన హామీ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు కీలక డిమాండ్లు ప్రస్తావించాయి. ఒక్క అంశంపైనా తక్షణ పరిష్కారం చూపకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిగా సమావేశం నుంచి వెనుదిరిగారు.
ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని...
» 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి
» 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరు చేయాలి
» బకాయి నాలుగు డీఏల్లో కనీసం ఒక డీఏ వెంటనే ఇవ్వాలి
» 11వ పీఆర్సీ డీఏ బకాయిలు చెల్లించాలి
» సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరించాలి
» పెన్షనర్లకు గ్రాట్యుటీ, కమ్యూటెషన్, ఈఎల్ చెల్లింపులు ఇవ్వాలి
» రెసిడెన్షియల్ సొసైటీల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు చేయాలి ట ఈహెచ్‌ఎస్ కార్డుల సమస్యలు పరిష్కరించి రీయింబర్స్‌మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంచాలి.
వీటిపై సీఎస్ ఏమన్నారంటే
‘‘ఉద్యోగులకు సంబంధించి 114 అంశాలు పెండింగులో ఉన్నాయి. ఉద్యోగుల అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆర్థికేతర సమస్యలపై సానుకూలంగా స్పందిస్తాం’’ అని మాత్రమే సీఎస్ ‘హామీ’ ఇచ్చారు.
నేతల అసంతృప్తి ఇలా...
ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు
ఉద్యోగుల బకాయిలు రూ.30 వేల కోట్లు దాటిపోయాయి. ఒక ఉద్యోగికి ఎంత బకాయి ఉందో పే స్లిప్‌లో చూపించాలని మే ము డిమాండ్ చేశాం. సీఎం అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఎప్పుడు అమలవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఎసీ అమరావతి అధ్యక్షులు
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు
పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం, 30 శాతం ఐఆర్, కనీసం ఒక డీఏ వెంటనే ఇవ్వాలని మేము కోరాం. ఉద్యోగుల బకాయిలు ఇవ్వకపోవడంతో 14 నెలలుగా వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. –విద్యాసాగర్, ఎపీఎన్జీవో అధ్యక్షులు
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
పాఠశాల విద్యా సమస్యలు, టీచర్ల అంశాలను ప్రస్తావించాం. అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నైజేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. మున్సిపల్ టీచర్లకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి –జి. హృదయరాజు, ఎపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు