
'దాచుకుంటే ....దోచుకెళ్లారు'
బంగారం దాచుకునేందుకు బ్యాంకులు, లాకర్లున్నా... పదేళ్లుగా ఆ దంపతులు పాటించిన అతి జాగ్రత్తే చివరకు వారి కొంపముంచింది.
బంగారం దాచుకునేందుకు బ్యాంకులు, లాకర్లున్నా... పదేళ్లుగా ఆ దంపతులు పాటించిన అతి జాగ్రత్తే చివరకు వారి కొంపముంచింది. బీరువాలో ఆభరణాలు పెండితే దొంగలు ఎత్తుకెళ్లారని భావించిన వారిద్దరూ వాటిని ఇంటి వెనుక భూమిలో గొయ్యి తీసి దాచి పెట్టారు. కానీ తెలివిమీరిన దొంగలు, వారు షిర్డీ వెళ్లిన సమయంలో 25 తులాల బంగారు నగలు మాయం చేశారు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సూర్యాపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సూర్యాపేట : అతనో చిరుద్యోగి...పేరు తూము మల్లయ్య. నల్గొండ ఆర్టీసీ ఆర్ఎం ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం. భార్య నిర్మల ఇంటి వద్దే బ్యూటీపార్లర్ నడుపుతోంది. వీరు సూర్యపేటలోని కుడకుడ రోడ్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లోని బీరువాలో బంగారు నగలు, డబ్బులు భద్రపరుచుకుంటే చోఈరలకు గురవుతాయని భావించిన వీరు... వాటి విషయంలో అతి జాగ్రత్తలు పాటించేవారు. గత పదేళ్లుగా వాటిని తమ ఇంటి వెనక మరుగుదొడ్ల పక్కన ఒక గుంత తీసి అందులో భద్రపరుస్తున్నారు.
బంగారు ఆభరణాలు, డబ్బులను ఒక బాక్సులో పెట్టి వాటిని తీసిన గుంతలో పెట్టి దానిపై ఒక బండను పెడుతున్నారు. ఈ క్రమంలో గత నెల (డిసెంబర్) 24న నిర్మల తన ఇంట్లోని 14 తులాల బంగారు నగలతోపాటు, సోదరికి చెందిన మరో 11 తులాల ఆభరణాలను అతి జాగ్రత్తగా ఎప్పటిలాగే భూమిలో భద్రపరిచి, పైన ఓ బండ పెట్టి కుటుంబంతో కలిసి షిర్డీ వెళ్లారు. తిరిగి వచ్చాక కూడా ఆభరణాలు ఉన్నాయో...లేవో అని 15 రోజులుగా చూసుకోలేదు.
ఈ క్రమంలో రమాదేవి కొనుగోలు చేసిన స్థలానికి డబ్బులు అవసరం కాగా, సోదరి నిర్మల వద్ద తన ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనుకుంది. నిర్మల కూడా ఓ శుభకార్యానికి వెళ్లాల్సి ఉండగా ఆభరణాలను ధరించేందుకు ఎప్పటిలాగే గుంత వద్దకు వెళ్లింది. అందులో మట్టి తోడి చూడగా.... ఆభరణాలు లేవు. గుంతపై పెట్టిన బండ మాత్రం భద్రంగా అలాగే ఉంది. దీంతో నగలు ఎలా మాయమయ్యాయోనని పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.