మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు కార్పొరేట్‌స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లావైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పిల్లి సాంబశివరావు అన్నారు.
ఏటూరునాగారం, న్యూస్‌లైన్ :
మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు కార్పొరేట్‌స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లావైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పిల్లి సాంబశివరావు అన్నారు. మండలంలోని రామన్నగూడెం, రాంనగర్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న గొత్తికోయ చిన్నారులకు సోమవారం పల్స్‌పోలియో చుక్కలు వేసి వైద్యసేవలపై ఆరాతీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశం నలుమూలల నుంచి జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు అందించేందుకు మేడారంలోని కల్యాణ మండపంలో 60 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాక జాతర పరిసర ప్రాంతాల్లో మరో 12 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు.
మొబైల్ అంబులెన్స్, పారామెడికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాతర చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారని వెల్లడించారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే చికిత్స అందించేందుకు అంబులెన్సులు, ప్రైవేటు వాహనాలను అందుబాటులో ఉంచుతామన్నారు. 24గంటల పాటు వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది వంతుల వారీగా విధులు నిర్వర్తిస్తారని వివరించారు. పల్స్‌పోలియో చుక్కలు పిల్లలకు వేయించలేకపోయిన వారు వెంటనే సమీపంలోని సబ్‌సెంటర్లు, ఏఎన్‌ఎంలు, ఆశల వద్దకు వెళ్లి వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట ఐటీడీఏ డిప్యూటీ డీహెచ్‌ఎంఓ కూన దయానందస్వామి, ఎస్‌పీహెచ్‌ఓ ప్రదీప్, రొయ్యూరు వైద్యాధికారి రాజు, హెల్త్ సూపర్ వైజర్ సమ్మయ్య, ఏఎన్‌ఎంలు ఉన్నారు.
సమాచారం ఇచ్చిన ఐదు నిమిషాలకే అంబులెన్స్
తాడ్వాయి : జాతరలో సమాచారం ఇచ్చిన ఐదు నిమిషాలకే అం బులెన్సు ప్రమాద స్థలానికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. మేడారం లో ఆయన మాట్లాడుతూ గత జాతరలో ఆరు మినీ అంబులెన్స్‌లు ఏర్పాటు చేయగా ఈసారి 14 ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకు ముందు ఆయన ప్రథమ చికిత్స శిబిరాలను ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించారు. అలాగే సమ్మక్క ప్రధాన ఆ ర్చిగేట్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని సం దర్శించి ఓ పాపకు పోలియో చుక్కలు వేశా రు. ఆయనతో డాక్టర్ క్రాం తికుమార్, హెచ్‌వీ యా కలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ తిరుపతి ఉన్నారు.