పిల్లలను చేర్చితేనే జీతాలు

Corporate Schools Target to Teachers in Guntur - Sakshi

టార్గెట్‌ పెట్టి టీచర్లను వేధిస్తున్న కార్పొరేట్‌ యాజమాన్యాలు

వేసవిలో ఒక్కరోజూ సెలవు  ఇవ్వని వైనం

లక్ష్యం పూర్తి చేసేందుకు చేతిలో డబ్బు కడుతున్న టీచర్లు

పని భారంతో బోధన, బోధనేతర సిబ్బంది సతమతం

కఠిన చర్యలు చేపట్టడంలో  అధికార యంత్రాంగం తాత్సారం

గుంటూరు ఎడ్యుకేషన్‌: కార్పొరేట్‌ విద్యాసంస్థల ఆగడాలకు హద్ధు అనేది లేకుండా పోతోంది. ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగా అడ్మిషన్లు చేపట్టడం సాధారణమే అయినా ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు అవలంభిస్తున్న తీరుతో బోధన, బోధనేతర సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకూ పాఠశాలలకు, జూన్‌ మొదటి వారం వరకూ జూనియర్‌ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే గత విద్యాసంవత్సరం ముగిసి, సెలవులు మొదలైన ఏప్రిల్‌ 24 నుంచి ఉపాధ్యాయులతో పాటు అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి సెలవులు ఇవ్వకుండా అడ్మిషన్ల పేరుతో ఇంటింటికీ పంపడం ప్రారంభించారు. బోధన, బోధనేతర సిబ్బందికి వారి స్థాయి, హోదాను బట్టి టార్గెట్లు విధించి, అడ్మిషన్‌ తెస్తేనే వేతనం, లేకపోతే చివాట్లు పెట్టే పద్ధతి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బోధన, బోధనేతర వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో బీఈడీ, డీఎడ్, ఎంఈడీ, ఎమ్మెస్సీ విద్యార్హతలు కలిగిన విద్యావంతులు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను సాధించలేక, విధి లేని పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఉద్యోగాలను చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఎంతటి పని భారాన్నైనా తట్టుకుని వెళుతుండగా, ఏడాదిలో 10 నెలలు సజావుగా సాగుతున్న పరిస్థితుల్లో వేసవి సెలవుల్లో వారికి గడ్డు కాలం ఎదురవుతోంది. మే నెలలో ఇచ్చిన టార్గెట్‌ ప్రకారం అడ్మిషన్లు చేసిన వారికే జూన్‌ నెలలో వేతనం ఇస్తామని కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది.

గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా క్యాంపస్‌లు కలిగి ఉన్న శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్నారై అకడమీ తదితర కార్పొరేట్‌ విద్యాసంస్థల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అడ్మిషన్ల వేటలో సమిధలుగా మారుతున్నారు. మండు టెండల్లో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు తమ విద్యాసంస్థల ప్రగతి గురించి వివరించి, కరపత్రాలు, బ్రోచర్లు ఇచ్చి వస్తున్నారు.  అడ్మిషన్‌ కోసం వెళ్లిన సమయంలో అడ్మిషన్‌ ఖరారు చేసేందుకు కొంత మొత్తం ఫీజును వసూలు చేసేందుకు తల్లిదండ్రుల కాళ్లా, వేళ్లా పడి ప్రాధేయపడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, సత్తెనపల్లి, బాపట్ల వంటి పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు ఈ విధంగా అడ్మిషన్ల డ్రైవ్‌ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినులు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ తిరుగుతూ భద్రత లేని ఉద్యోగం చేస్తున్నారు. ఎండల కారణంగా సాయంత్రం 7.00 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లి అడ్మిషన్లు కోసం ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇటీవల గుంటూరు నుంచి చౌడవరం గ్రామానికి అడ్మిషన్ల కోసం వెళ్లిన ఓ ఉపాధ్యాయిని జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై, ఆస్పత్రి పాలైంది. అడ్మిషన్‌ పేరుతో తెస్తున్న అధిక ఒత్తిడి భరించలేక నగరానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు పక్షవాతానికి గురై మంచం పట్టారు. ఆయా క్యాంపస్‌లలో ప్రిన్సిపాళ్లు, డీన్లు, ఏజీఎం, డీజీఎంల వరకూ ఎవరి స్థాయిలో వారు అడ్మిషన్ల కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తుండటంతో సిబ్బంది ఉద్యోగం మానేస్తున్నారు. అడ్మిషన్‌ తెస్తేనే జీతం చెల్లిస్తామని, లేకుంటే లేదని బెదిరిస్తున్న సంఘటనలపై బయటకు చెప్పుకోలేక ఆందోళన చెందుతున్నారు. కార్పొరేట్‌ యాజమాన్యాల తీరుతో తీవ్ర కలత చెందుతున్న మధ్య తరగతి  ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేరే దారి లేక, ఒక్కో సారి తల్లిదండ్రులు పెడుతున్న చివాట్లను భరిస్తున్నారు.

ఫిర్యాదు చేసినాపట్టించుకోవడం లేదు
అడ్మిషన్లు చేస్తేనే జీతం, సెలవులు ఇస్తామని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులను వేధిస్తున్నాయి. ప్రస్తుతం మే నెల వేతనం చెల్లించే పరిస్థితులు లేవని కార్పొరేట్‌ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు మా దృష్టికి తెచ్చారు. తీవ్రమైన పని ఒత్తిడితో భద్రత లేని ఉద్యోగాలను చేస్తుండగా, మరో వైపు అడ్మిషన్ల కోసం టార్గెట్లు విధించి వేధిస్తున్నారు. పీఆర్‌వోల చేత చేయించాల్సిన అడ్మిషన్లను బోధన, బోధనేతర సిబ్బందితో చేయిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై గతంలో ధర్నాలు, ఆందోళనలు చేసి, అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.– వానపల్లి సుభాని, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్‌ యూనియన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top