బంగారానికి మెరుగులు దిద్ది ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారుల జీవితాలు ప్రస్తుతం కళావిహీనంగా మారాయి. కార్పొరేట్ జ్యూయెలర్స్
ఆకివీడు : బంగారానికి మెరుగులు దిద్ది ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారుల జీవితాలు ప్రస్తుతం కళావిహీనంగా మారాయి. కార్పొరేట్ జ్యూయెలర్స్ షాపుల రాకతో రెడీమేడ్ నగలకు గిరాకీ పెరిగింది. ఫలితంగా బంగారుషాపుల్లో ఆర్డర్లపై నగలు చేయించేవారు తగ్గిపోయారు. ఒకప్పుడు ఆభరణాలు కావాలంటే ముందుగా ఆర్డర్లు ఇచ్చి ప్రత్యేకంగా చేయించుకునేవారు. ఫలితంగా స్వర్ణకారుల చేతినిండా పని ఉండేది. ఆదాయమూ బాగుండేది. ప్రస్తుత ఉరుకులు, పరుగుల కాలంలో నగలు రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. యంత్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ మోడళ్లలో చేసిన ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా స్వర్ణకారులు చేతితో చేసే నగలకు గిరాకీ తగ్గింది. ఆర్డర్లు లేకపోవడంతో స్వర్ణకారులు పనిలేక అవస్థలు పడుతున్నారు. రోజుకు రూ.200 రావడం లేదని, ఇవి కూడా ఎక్కువగా పాత నగల మరమ్మతుల చేయడం వల్లే వస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు.
పొరుగు రాష్ట్రాల కార్మికులతో పోటీ
రెడీమేడ్ నగలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు స్వర్ణకారులకు పోటీగా మారారు. పచ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి యంత్రాలపై ఆభరణాల తయారీలో నైపుణ్యంకల కార్మికులను జ్యూయెలర్‌స యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలు తీసుకొస్తున్నాయి.
దీంతో ఎన్నోఏళ్ల నుంచి ఈ వృత్తినే నమ్ముకున్న స్వర్ణకారులకు పనిలేకుండా పోతోంది.
రాష్ట్రంలో 70 లక్షల మంది.. జిల్లాలో 46వేల మంది
రాష్ట్రంలో 70 లక్షల మంది, జిల్లాలో 46వేల మంది స్వర్ణకారులు ఉన్నారు. వీరంతా వెనుకబడిన తరగతుల వారే. అధిక శాతం ఇంకా పొయ్యి, కిరోసిన్ డబ్బాలు ఉపయోగించే నగలు తయారు చేస్తున్నారు. ఆధునిక యంత్ర సామగ్రి లేకపోవడంతో వృత్తిలో నైపుణ్యం సాధించలేకపోతున్నారు. నగల తయారీలో వాడే రసాయనాలు వీరి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. ఫలితంగా వారు 50ఏళ్లకే తీవ్ర వృద్ధాప్యంలోకి వెళ్లిపోతున్నారు.
స్వర్ణకార ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఈ నేపథ్యంలో స్వర్ణకారులు తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వ్యాపారం, వృత్తిలో నైపుణ్యం పెంచుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసంఘటిత కార్మికులుగా గుర్తించి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, ఐటీఐ తరహాలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధునిక పోకడలపై శిక్షణ ఇవ్వాలని, ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికులకు రూ.పదిలక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నారు.
బంద్ ప్రభావంతో విలవిల
ప్రసుతతం గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది స్వర్ణకారుల పరిస్థితి. అసలే పనుల్లేక అలమటిస్తున్న వారి జీవనంపై బంగారు దుకాణాల బంద్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీని నిరసిస్తూ బంగారు దుకాణాలు చేస్తున్న బంద్‌తో కొద్దిరోజులుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా వచ్చే రూ.200 కూడా రాక కార్మికులు పస్తులతో కాలం గడుపుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.