సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు ఇవ్వండి

Coronavirus: Various People Donations To CM Relief Fund - Sakshi

ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు, ఈ విపత్తు నుంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు వచ్చి ఏపీ ముఖ్య మంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌)కు  విరాళాలు అందజేయవలసినదిగా ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అభయ్‌ త్రిపాఠి ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ విరాళాలు సమకూర్చు వారికి నూటికి నూరు శాతం ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. చెక్కు రూపంలో పంపదలచుకున్న దాతలు ‘చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్, ఆంధ్రప్రదేశ్‌’ పేరున పంపాలని కోరారు.

ఆన్‌లైన్‌లో పంపదలచిన వారు: 
ఎస్‌బీఐ ఖాతా నెంబరు 38588079208, వెలగపూడి, సెక్రటేరియట్‌ బ్రాంచి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌0018884 
ఆంధ్రాబ్యాంకు ఖాతా నెంబరు: 110310100029039,  వెలగపూడి, సెక్రటేరియట్‌ బ్రాంచి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఏఎన్‌డీబీ0003079  
ఏపీసీఎంఆర్‌ఎఫ్‌ డాట్‌ ఏపీ డాట్‌ జీఓవీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో కూడా నెట్‌ బ్యాంకింగ్, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు ద్వారా పంపవచ్చు.
చెక్కుల రూపంలో విరాళాలను అందచేయాలని అనుకున్న ఢిల్లీ –ఎన్సీఆర్‌ ప్రాంతాలలోని దాతలు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ రిసెప్షన్‌లో అంద జేయగలరని ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. 

సీఎం సహాయ నిధికి పలువురి విరాళాలు
కరోనా వైరస్‌పై పోరాటానికిగాను భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షల విరాళమిచ్చారు.
కరోనా వైరస్‌ నివారణ చర్యల కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.42 లక్షలు విరాళంగా అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి చిత్తూరు జిల్లా చౌడేపల్లెకు చెందిన విజయవాణి ప్రింటర్స్, విద్యాసంస్థల అధినేత ఎన్‌.సుధాకరమూర్తి రూ.5 లక్షలు విరాళమిచ్చారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి చిలకలూరిపేట ఆర్యవైశ్య విద్యానిధి సంఘం రూ.25 వేలు విరాళమిచ్చింది. చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణుడు డాక్టర్‌ నల్లూరి కోటేశ్వర్, డాక్టర్‌ మైథిలీ రాణి దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేలు ఇచ్చారు. నరసరావుపేట వాసవీ షాపింగ్‌మాల్‌ ప్రతినిధులైన మండవ చంద్రశేఖర గుప్తా, డాక్యుమెంట్‌ రైటర్‌ పిల్లుట్ల రమణమూర్తి, న్యాయవాది కేసరి శ్రీనివాసరెడ్డిలు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 లక్ష విరాళమిచ్చారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ ఎండీ నారా భువనేశ్వరి రూ.30 లక్షల చొప్పున విరాళమిచ్చారు. అలాగే, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు సీఎంఆర్‌ఎఫ్‌లకు రూ.10 లక్షల చొప్పున విరాళమిచ్చారు. 
కరోనా నిర్మూలనా చర్యల్లో భాగంగా ప్రజారోగ్య కార్యక్రమాల నిర్వహణకు అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి తమ నిధుల నుంచి రూ.కోటి కేటాయించారు.  
కరోనా నివారణకు శ్రీచైతన్య విద్యాసంస్థల తరఫున రూ. 4 కోట్లు విరాళమిస్తున్నట్లు ఆ సంస్థల అధినేత డా. బీఎస్‌ రావు పేర్కొన్నారు. దీనిలో ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 1.5 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రుల సహాయనిధులకు చెరో కోటి రూపాయలు, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రుల సహా యనిధులకు చెరో రూ. 25 లక్షలను విరాళమిస్తునట్లు ఓ ప్రకటనలో బీఎస్‌ రావు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top