ఏపీ చొరవ.. విశాఖకు తెలుగు విద్యార్థులు

Coronavirus: Telugu Students Reached To Visakhapatnam From Malaysia - Sakshi

సాక్షి, విశాఖపట్నం : కరోనావైరస్‌ కారణంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులను ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవతో తెలుగు విద్యార్థులు విశాఖపట్నంకు చేరుకున్నారు. కౌలాలంపూర్‌ నుంచి 186 మంది విద్యార్థులతో వచ్చిన ప్రత్యేక విమానం బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకుంది.

కోవిడ్‌–19 వల్ల ఫిలిప్పీన్స్‌ దేశంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో మలేషియాకు చేరుకున్న తెలుగు విద్యార్థులు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం.. విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌ను సంప్రదించారు. విద్యార్థులందరినీ తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేయడంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కౌలాలంపూర్‌ నుంచి విశాఖపట్నం, ఢిల్లీకి ఎయిర్‌ ఏషియా విమానాలు నడిపేందుకు ఆయన అనుమతించారు. దీంతో తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు.
(చదవండి : కరోనా ఎఫెక్ట్‌: 7 ప్రత్యేక రైళ్ల సేవలు రద్దు)

ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్
తెలుగు విద్యార్థులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులందరికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులను పరిక్షీంచేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారిని విశాఖ చెస్ట్‌ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు. విశాఖ చెస్ట్‌ ఆస్పత్రిలో ఇప్పటికే 100 పడకలను సిద్ధం చేశారు. 50మంది వైద్యులను నియమించారు. విదేశాల నుంచి వచ్చే వారిని విమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డులకి తరలించేందుకు ఐదు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఏ లక్షణాలు లేకున్నా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచనున్నారు. ప్రయాణికులను స్వస్థలాలకు చేర్చడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top