కరోనా పాజిటివ్‌ కేసులు 10

Coronavirus Positive Cases Reached to 10 In AP - Sakshi

తాజాగా విజయవాడ, గుంటూరుకు చెందిన ఇద్దరికి నిర్దారణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 8 నుంచి 10కి చేరింది. బుధవారం విజయవాడ, గుంటూరుకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చినట్లు బుధవారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. వీరిద్దరు ఇతర ప్రాంతాల నుంచి ఇటీవల వచ్చినవారే. రాష్ట్రంలో ఇప్పటి వరకు అనుమానిత లక్షణాలున్న 312 మంది నుంచి నమూనాలు సేకరించి వైద్యపరీక్షలకు పంపించారు. అందులో 229  నెగిటివ్‌ కాగా మరో 73 నమూనాలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. బుధవారం ఒక్కరోజు 13 నమూనాలు పంపించారు. రాష్ట్రంలో హోం క్వారంటైన్‌లో ప్రస్తుతం 15,143 మంది ఉన్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు. 97 మంది ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గత రెండు రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల సంఖ్య ఒక్కటి కూడా నమోదు కాలేదని  వెల్లడించారు. 

ఒకరు అమెరికా నుంచి.. మరొకరు ఢిల్లీ నుంచి రాక
బుధవారం పాజిటివ్‌గా తేలిన కేసుల్లో ఇద్దరూ ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారే. అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న విజయవాడ గాయత్రినగర్‌కు చెందిన యువకుడు ఈనెల 20న ఢిల్లీ మీదుగా ఇంటికి చేరుకున్నాడు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చెక్‌ చేసిన తర్వాతే పంపారు. సోమవారం అనుమానంతో తండ్రితో కలిసి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా పరీక్షలో కరోనా సోకినట్లు నిర్ధా్దరించారు. గుంటూరుకు చెందిన మరో వ్యక్తి ఈనెల 14న ఓ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లాడు. సమావేశంలో అతనితో పాటు 20 మంది పాల్గొన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత 18వ తేదీ అతను తిరుగు ప్రయాణం అయి 19వ తేదీ విజయవాడలో రైలు దిగి గుంటూరు వెళ్లాడు. 23వ తేదీ కుమారుడి సాయంతో ఆస్పత్రిలో చేరగా పరీక్షల అనంతరం పాజిటివ్‌గా తేలింది. 

ఏపీకి ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లు
కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులకు వైద్య పరీక్షలు చేసేందుకు  ర్యాపిడ్‌ టెస్ట్‌కిట్‌లు తీసుకువస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ జవహర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. క్వారంటైన్‌ వసతి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top