
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతోంది. వారం కిందట 22 శాతం ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 34.30 శాతానికి పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. అలాగే, గడిచిన 24 గంటల్లో 65 మంది కోవిడ్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,717 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 589 మందిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. గడిచిన 24గంటల్లో మొత్తం 8,263 శాంపిల్స్‌ను పరీక్షించగా 67 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇక రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 1,094 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, కోవిడ్‌తో కొత్తగా ఒకరు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరింది.