ఏపీలో కరోనా సామూహిక వ్యాప్తి 8 శాతమే 

Coronavirus: Eight Percentage Of Coronavirus Mass Spread In Andhra pradesh - Sakshi

ఢిల్లీ, తెలంగాణల్లో మొదలైన కమ్యూనిటీ స్ప్రెడ్‌ 

మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో అధిక రిస్క్‌

ఇండియా డాట్‌ ఇన్‌ పిక్సెల్స్‌ సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి: అత్యధిక టెస్టులు నిర్వహించడం ద్వారా కోవిడ్‌–19 సోకిన వారిని త్వరగా గుర్తించి వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం సత్ఫలితాలనిస్తోంది. కమ్యూనిటీ స్ప్రెడ్‌ (సామూహిక వ్యాప్తి) జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. ఇండియా డాట్‌ ఇన్‌ పిక్సెల్స్‌ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సమాచారాన్ని తీసుకొని కమ్యూనిటీ స్ప్రెడ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 

  • మన రాష్ట్రంలో కోవిడ్‌–19 కమ్యూనిటీ స్ప్రెడ్‌కు 8 శాతం మాత్రమే అవకాశముంది. 
  • 7,000 కేసులు దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్‌ అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం గమనార్హం. 
  • రాష్ట్రాల్లో నమోదైన కేసులు, కోలుకున్న వారు, క్వారంటైన్‌లో ఉన్న వారి వివరాల ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్‌ అవకాశాలకు ఒక ఫార్ములా రూపొందించారు. 
  • దీని ప్రకారం 100 శాతం దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్‌ తప్పనిసరి. 
  • ఇలా చూస్తే ఢిల్లీ 143 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 122 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 
  • గుజరాత్‌ 45 శాతం, మహారాష్ట్ర 65 శాతం, రాజస్తాన్, పశ్చిమబెంగాల్‌ 24 శాతం, తమిళనాడు 38 శాతాలతో కమ్యూనిటీ స్ప్రెడ్‌కు అవకాశాలు అధికంగా ఉన్నాయి. 
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అత్యధిక టెస్టులు నిర్వహించడం ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్‌ను అరికట్టామంటూ పలువురు అధికారులు ట్వీట్‌ చేస్తున్నారు. 

7 లక్షలకు చేరువలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు 7 లక్షలకు చేరుకోనున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,704 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 6,93,548కి చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న ప్రకారం కొత్తగా 443 మందికి వైరస్‌ సోకడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,372కు చేరింది. ఈ కేసుల్లో 1,584 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, 337 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారు. కొత్తగా 128 మందిని డిశ్చార్జి చేయడంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,435కి చేరింది. కృష్ణా, కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 111కి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,826కి చేరింది. 
ఇన్ఫెక్షన్‌ రేటు   -1.35% 
రికవరీ రేటు       -47.32% 
మరణాల రేటు  -1.18%

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top