కరోనా: యువత..జాగ్రత్త!

Coronavirus Effects On Young People In Chittoor district - Sakshi

కోవిడ్‌ బాధితుల్లో  యువతే అధికం  

40 ఏళ్ల లోపువారు 15 మంది

23 పాజిటివ్‌ కేసుల్లో ఒకరు రికవరి  

కంటికి కనిపించని మహమ్మారి కరోనా. ఇది నేడు ప్రపంచాన్ని వణికిస్తోంది. జిల్లాలోనూ ఈ వ్యాధి ప్రబలింది. వ్యాధిగ్రస్తుల్లో అధిక శాతం మంది యువకులే. జిల్లాలో వాతావరణ స్థితి.. రోగుల్లో అధిక వ్యాధి నిరోధక శక్తి ఉండడంతో వీరు త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా యువత జులాయిగా బయట తిరగకుండా.. ఆరోగ్యం అశ్రద్ధ చేయకుండా ఇంటిపట్టునే ఉండి, కరోనా నుంచి రక్షణ పొందాల్సి ఉంది.

చిత్తూరు: కరోనా అందరినీ కలవరపెడుతోంది. ముఖ్యంగా యువకులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జిల్లా అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు దశల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఆ సర్వేల్లో అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి క్వారంటైన్లకు పంపడం చేశారు.

క్వారంటైన్లలో ఉన్న వారందరికీ రక్తపరీక్షలు నిర్వహించారు. నెగిటివ్‌ వచ్చిన వారిని ఇళ్లకు పంపారు. జిల్లా వ్యాప్తంగా 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో శ్రీకాళహస్తికి చెందిన మొదటి కరోనా కేసు వ్యక్తికి నెగిటివ్‌ రావడంతో ప్రస్తుతం 22 మంది పాజిటివ్‌గా ఉన్నారు. 22 కేసుల్లో 40 ఏళ్ల లోపు వారు 15 మంది ఉన్నారు. మిగిలిన ఏడుగురు 40 ఏళ్ల పైబడినవారు ఉన్నారు. కాబట్టి యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.

నిలకడగానే ఆరోగ్యం 
జిల్లాలోని 23 పాజిటివ్‌ కేసుల్లో శ్రీకాళహస్తిలో మొట్టమొదట నమోదైన పాజిటివ్‌ కేసు బాధితుడు ఇటీవల డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం పాజిటివ్‌గా ఉన్న 22 మంది తిరుపతి రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రిలో, చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 22 మందిలో 15 మంది యువకులే ఉండడం వల్ల కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువకుల్లో వ్యా«ధి నిరోధక శక్తి ఉండడం వల్ల వారు త్వరగా కోలుకుంటారని వెల్లడిస్తున్నారు. 

ఆరుగురు మహిళలు  
కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల్లో ఆరుగురు మహిళలున్నారు. నగరిలో ఇద్దరు, తిరుపతిలో ఇద్దరు, రేణిగుంటలో ఒకరు, శ్రీకాళహస్తిలో ఒకరు ఉన్నారు. శ్రీకాళహస్తిలో 14 ఏళ్ల బాలుడికి పాజిటివ్‌ వచ్చింది. వీరికి కుటుంబంలోని పురుషుల ద్వారా కరోనా సోకి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తిరుపతిలోని మరో మహిళకు హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వచ్చే సమయంలో కరోనా సోకిందని తేలింది. 

ఆరోగ్యం నిలకడగా ఉంది
కరోనా పాజిటివ్‌ నమోదైన వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. తిరుపతి, చిత్తూరు ఆస్పత్రుల్లో పాజిటివ్‌ కేసులను ఉంచారు. ఇంటింటి సర్వే చేశాం. మూడో దశ సర్వేలో 10 మందికి జ్వరం, దగ్గు లక్షణాలు ఉడడంతో క్వారంటైన్లకు పంపాం. విదేశాల నుంచి వచ్చిన వారికి 24 రో జుల క్వారంటైన్‌ పూర్తయింది. 
– నారాయణ భరత్‌గుప్తా, కలెక్టర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top