ధైర్యంగా ఉండండి

Coronavirus: DGP Gautam Sawang spoke to Telugu students in London - Sakshi

లండన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు డీజీపీ సవాంగ్‌ భరోసా  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి

సాక్షి, అమరావతి: ‘మీరెవరూ నిబ్బరం కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయ్‌’ అని లండన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ భరోసా ఇచ్చారు. కోవిడ్‌–19 కారణంగా ఈనెల 20 నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో చివరి నిమిషంలో హిత్రూ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు, ప్రయాణికులు ప్రస్తుతం లండన్‌లోనే ఉంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితోపాటు ఏపీకి చెందిన 29 మంది అక్కడే ఉండిపోయారు. విమానాలు నిలిపివేయడంతో తామంతా అక్కడ చిక్కుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఎన్‌ఆర్‌టీ కంట్రోల్‌ రూమ్, సీఐడీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన డీజీపీ సవాంగ్‌ ఏపీ సీఐడీ (ఎన్‌ఆర్‌ఐ సెల్‌), ఏపీ ఎన్‌ఆర్‌టీల సమన్వయంతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో మాట్లాడారు. 

విద్యార్థుల గోడు ఇది..
అల్లూరి గోపాల్‌ అనుకోకుండా లండన్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయాం. ఈ నెల 20 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వెంకట్‌ మేడపాటి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన చొరవతో ఇక్కడ ఐదు రోజులు మాకు ఏర్పాట్లు బాగానే చేశారు. తర్వాత కొంత ఇబ్బందిగా మారింది. తాత్కాలిక షెల్టర్లలో ఉంటున్నాః. ఆహారం ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

యుగసాయి,  కార్తీక్‌రెడ్డి, గంగిరెడ్డి
ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆహారానికి ఇబ్బందిగా ఉంది. బయటకెళ్లి ఆహారం తెచ్చుకుందామంటే పోలీసులు పట్టుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా వైరస్‌ వస్తుందనే భయం వెంటాడుతోంది. 

నెలనూతల కార్తీక్, మరి కొందరు విద్యార్థులు
దేశంలో ఎవరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మా సమస్య తెలుసుకుని స్పందించడం, వెంటనే డీజీపీ మాతో మాట్లాడటం చాలా ధైర్యాన్నిచ్చింది. కరోనా వైరస్‌ ప్రభావం మాపైనా పడుతుందేమోననే భయమేస్తోంది. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తక్షణమే మమ్మల్ని ఇండియా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. 

డీజీపీ ఏం భరోసా ఇచ్చారంటే..
► మీరెవరూ ఆందోళన చెందొద్దు. ధైర్యంగా ఉండండి. మీ ఇబ్బందులను తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాను. 
► వీలైనంత  త్వరగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. 
► మీకు ఏపీ సీఐడీ (ఎన్‌ఆర్‌ఐ సెల్‌), ఏపీ ఎన్‌ఆర్‌టీ అందుబాటులో ఉంటాయి. 
► ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడి వారితో వీడియో కాల్‌లో మాట్లాడండి.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది
లండన్‌లో చిక్కుకున్న మన వాళ్లను వెనక్కి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. అక్కడ చిక్కుకున్న వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలిచ్చారు. విదేశాంగ శాఖ, హోం శాఖ అధికారులు, లండన్‌లోని ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. 
– వెంకట్‌ మేడపాటి,  ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు

లండన్‌లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. వీరిని వీలైనంత త్వరగా ఏపీకి పంపేలా చేస్తున్నాం. 
 – యూరప్‌లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కందుల రవీందర్‌రెడ్డి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top