సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న రైతులకు ఇకపై ఆన్‌లైన్‌లోనే సహ కారం అందించేందుకు ఆ శాఖ సన్నద్ధమ వుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న రైతులకు ఇకపై ఆన్‌లైన్‌లోనే సహ కారం అందించేందుకు ఆ శాఖ సన్నద్ధమ వుతోంది. నేరుగా సహకార రుణాలను అందించడం వల్ల సిబ్బంది కక్కుర్తి, పాలకుల చేతివాటం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మాన్యువల్‌గా జరుగుతున్న లావాదేవీల వల్ల ఎక్కడేం జరుగుతోందో ఆ శాఖ ఉన్నతాధికారులు తెలుసుకోలేని దుస్థితి దాపురించింది. దీంతో జిల్లాలోని పలు సహకార సంఘా(పీఏసీఎస్)ల్లో బినామీ రుణాలు...సంఘాల నిధుల స్వాహా...సొంతానికి వాడుకుంటున్న ఎరువుల నిధులు...పర్నిచర్, స్టేషనరీ కొనుగోళ్లలో చేతివాటం’ తరహా ఫిర్యాదులు, ఆరోపణలే ఎక్కువగా వచ్చాయి. ఈ ఆరోపణల్లో ఏ ఒక్కదాన్నీ కొట్టి పారేయలేని పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లేకపోవడమే కారణమని ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇకపై రైతులకు ఆన్‌లైన్‌లోనే సహకారం అందించేందుకు ఆ శాఖ సన్నద్ధమవుతోంది. సంఘాల కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని, లావాదేవీలన్నీ మాన్యువల్‌గా కాకుండా కంప్యూటర్‌లో క్రోడీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులకు ఏటీఎం తరహా కార్డులు ఇచ్చేందుకు పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచనప్రాయ ఆదేశాలొచ్చాయి.
విచారణలో వెలుగుచూసిన అక్రమాలు
జిల్లాలోని రావివలస...చెముడు...రాచకిండాం...ఇలా అనేక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో బినామీ రుణాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలున్నాయి. ప్రాథమిక విచారణ నేపథ్యంలో వెలుగు చూసిన అక్రమాల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రావివలస, చెముడు, రాచకిండాం తదితర సంఘాలపై సెక్షన్ 51స్టాట్యుటరీ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం వాటిపై ముమ్మరంగా విచారణ జరుగుతోంది. గతంలో 51స్టాట్యుటరీ విచారణ చేపట్టడం ద్వారా పెద్దతాడివాడ, ఉత్తరాపల్లి, కుమ్మపల్లి, గజపతినగరం, తెర్లాం, పార్వతీపురం, సంతోషిపురం, అజ్జాడ, కోట సీతారాంపురం, జొన్నాడ, గజపతినగరం ఈపీఏడీబీ, గంట్యాడ, లక్కవరపుకోట, కంటకాపల్లి, మాదలింగి, ఎం.మామిడిపల్లి, పిరిడి సొసైటీల్లో అక్రమాలు జరిగినట్టు తేల్చారు.
అలాగే 52వ సెక్షన్ ప్రకారం విచారణ చేపట్టి లక్కిడాం, నందిగాం, తెర్లాం, నర్సిపురం, కోనాడ, పూసపాటిరేగ, నిడగల్లు, సొసైటీల్లో అక్రమాల నిగ్గు తేల్చారు. సెక్షన్ 53 ప్రకారం గొట్లాం పీఏసీఎస్‌లో విచారణ నిర్వహించి అక్రమాల్ని వెలికి తీశారు. ఇందులో రూ.కోటి 3లక్షల మేర అక్రమాలు జరిగి నట్లు బహిర్గతమైంది. పీఏసీఎస్‌లతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్, విజయా సొసైటీ, రైల్వే ఉద్యోగుల సహకార సొసైటీల్లో కూడా 51స్టాట్యుటరీ విచారణలు జరిగాయి.వీటిలో కూడా అక్రమాలు తేలాయి. ఎన్ని విచారణలు జరిగినా, అవతవకలు నిగ్గు తేల్చినా, బాధ్యులపై చర్యలు తీసుకున్నా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. దీనికంతటికీ సంఘాల రికార్డులు సక్రమంగా లేకపోవడం, అంతా మాన్యువల్‌గా జరగడమేనని తెలుస్తోంది. ఇప్పుడా కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు సహకార శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
అన్ని సహకార బ్యాంకుల కార్యకలాపాలూ..
పీఏసీఎస్ దగ్గర నుంచి డీసీసీబీ, సహకార కేంద్ర కార్యాలయం వరకు కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఎక్కడేం జరుగుతోందో గమనించొచ్చు. లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. దీంతో సంఘాల ఆదాయ, వ్యయాలపై ప్రతిరోజూ స్పష్టత ఉంటుంది. అలాగే, సహకార సంఘాల రికార్డులన్నీ కంప్యూటరీకరణ చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఈమేరకు సంఘాలకు కంప్యూటర్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించనున్నారు. ఇకపై సంఘాల సభ్యత్వం గల రైతులందరికీ మంజూరు చేసిన రుణమొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఆ మొత్తాన్ని సహకార శాఖ ఇచ్చే కార్డుతో ఏ బ్యాం కు ఏటీఎంలోనైనా డ్రా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.