breaking news
Cooperative Communities membership
-
సహకారం దక్కేనా ?
కామారెడ్డి నుంచి సేపూరి వేణుగోపాలచారి : వ్యవసాయ రంగానికి వెన్నెముక అయిన సహకార రంగానికి ఇక గడ్డు పరిస్థితులు తప్పేట్టు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు సమన్వయ సమితులు సహకార రంగానికి సవాల్‌గా నిలువనున్నాయి. భూముల వివరాలతోపాటు పంట సాగుకు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడం, రైతులకు విత్తనాలు, ఎరువులు సమకూర్చడం నుంచి పంట కొనుగోలు దాకా సర్వాధికారాలు ఇకపై రైతు సమన్వయ సమితులకు దక్కనున్నాయని ప్రభుత్వ ప్రకటనలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. రాష్ట్రంలో 906 సహకార సంఘాలతోపాటు ఉమ్మడి జిల్లా యూనిట్‌గా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి. అన్ని జిల్లాల సహకార బ్యాంకుల సమ్మిళితంగా రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్) పని చేస్తోంది. ఆయా సహకార సంఘాల్లో 20 లక్షల మంది రైతులు ఉన్నారు. రాష్ట్రంలో డీసీసీబీల వారీగా ఉన్న సహకార సంఘాలు సహకార సంఘాల్లోని రైతులు డైరెక్టర్లను, డైరెక్టర్లంతా కలిసి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. జిల్లాలోని ఆయా సంఘాల మెజారిటీ చైర్మన్లు కలిసి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, వైస్ చైర్మన్లతోపాటు అనుబంధంగా జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్, వైస్ చైర్మన్లనూ ఎన్నుకుంటారు. ఆయా జిల్లాల చైర్మన్లు కలిసి రాష్ట్ర చైర్మన్‌ను ఎన్నుకోవడం సహకార రంగంలోని విధానం. పార్టీలతో సంబంధం లేకుండా సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయి. దశాబ్దాలుగా రైతులకు సహకార సంఘాల ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి. రైతు సమన్వయ సమితులతో ముప్పు.. ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన రైతు సమన్వయ సమితులు ఇప్పుడు సహకార రంగానికి ముప్పు తెస్తాయని భావిస్తున్నారు. గ్రామస్థాయిలో గ్రామ సమన్వయ సమితి, మండలస్థాయిలో మండల సమన్వయ సమితి, జిల్లాస్థాయిలో జిల్లా సమన్వయ సమితిని ఏర్పాటు చేస్తారు. భూముల రికార్డుల నుంచి మొదలుకుని అన్ని విషయాలను రైతు సమన్వయ కమిటీలే చూసుకుంటాయని ప్రభుత్వం చెబుతుండడంతో సహకార సంఘాల ఉనికి ప్రశ్నార్థకం కానుందనే అనుమానం వస్తోంది. సహకార సంఘాల పరిస్థితి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తుండడం మూలంగా అసలు సహకార సంఘాలు ఉంటాయా? ఉండవా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఎన్నికల దిశగా ఆలోచన చేయడంలేదని తెలుస్తోంది. నాలుగు నెలల్లోముగియనున్న ‘విండో’ల పదవీకాలం రాష్ట్రంలో సహకార సంఘాలకు 2013లో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఎన్నికలు జరిగాయి. వాటితోపాటు జిల్లా సహకార, మార్కెటింగ్ సంస్థల పదవీకాలం వచ్చే ఏడాది మొదట్లో ముగియనుంది. అంటే మరో 4 నెలలే సంఘాల పాలకవర్గాలు పదవుల్లో కొనసాగుతాయి. అయితే ఏ వ్యవస్థలోనైనా ఎన్నికలు నిర్వహించాలంటే పదవీకాలం ముగిసేకన్నా ఆరు నెలల ముందే ప్రక్రియ మొదలు పెడతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి దృష్టి సారించలేదు. పంట రుణాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు కూడా సహకార సంఘాల ద్వారానే ఇస్తారు. విత్త నాలు, ఎరువులు సహకార సంఘాల ద్వారానే పంపిణీ అవుతున్నాయి. గత దశాబ్ద కాలంగా చాలా వరకు పండిన ధాన్యం కూడా సహకార సంఘాల ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతోంది. -
ఆన్లైన్లో సహకారం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న రైతులకు ఇకపై ఆన్లైన్లోనే సహ కారం అందించేందుకు ఆ శాఖ సన్నద్ధమ వుతోంది. నేరుగా సహకార రుణాలను అందించడం వల్ల సిబ్బంది కక్కుర్తి, పాలకుల చేతివాటం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మాన్యువల్‌గా జరుగుతున్న లావాదేవీల వల్ల ఎక్కడేం జరుగుతోందో ఆ శాఖ ఉన్నతాధికారులు తెలుసుకోలేని దుస్థితి దాపురించింది. దీంతో జిల్లాలోని పలు సహకార సంఘా(పీఏసీఎస్)ల్లో బినామీ రుణాలు...సంఘాల నిధుల స్వాహా...సొంతానికి వాడుకుంటున్న ఎరువుల నిధులు...పర్నిచర్, స్టేషనరీ కొనుగోళ్లలో చేతివాటం’ తరహా ఫిర్యాదులు, ఆరోపణలే ఎక్కువగా వచ్చాయి. ఈ ఆరోపణల్లో ఏ ఒక్కదాన్నీ కొట్టి పారేయలేని పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లేకపోవడమే కారణమని ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇకపై రైతులకు ఆన్లైన్లోనే సహకారం అందించేందుకు ఆ శాఖ సన్నద్ధమవుతోంది. సంఘాల కార్యకలాపాలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించాలని, లావాదేవీలన్నీ మాన్యువల్‌గా కాకుండా కంప్యూటర్లో క్రోడీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులకు ఏటీఎం తరహా కార్డులు ఇచ్చేందుకు పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచనప్రాయ ఆదేశాలొచ్చాయి. విచారణలో వెలుగుచూసిన అక్రమాలు జిల్లాలోని రావివలస...చెముడు...రాచకిండాం...ఇలా అనేక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో బినామీ రుణాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలున్నాయి. ప్రాథమిక విచారణ నేపథ్యంలో వెలుగు చూసిన అక్రమాల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రావివలస, చెముడు, రాచకిండాం తదితర సంఘాలపై సెక్షన్ 51స్టాట్యుటరీ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం వాటిపై ముమ్మరంగా విచారణ జరుగుతోంది. గతంలో 51స్టాట్యుటరీ విచారణ చేపట్టడం ద్వారా పెద్దతాడివాడ, ఉత్తరాపల్లి, కుమ్మపల్లి, గజపతినగరం, తెర్లాం, పార్వతీపురం, సంతోషిపురం, అజ్జాడ, కోట సీతారాంపురం, జొన్నాడ, గజపతినగరం ఈపీఏడీబీ, గంట్యాడ, లక్కవరపుకోట, కంటకాపల్లి, మాదలింగి, ఎం.మామిడిపల్లి, పిరిడి సొసైటీల్లో అక్రమాలు జరిగినట్టు తేల్చారు. అలాగే 52వ సెక్షన్ ప్రకారం విచారణ చేపట్టి లక్కిడాం, నందిగాం, తెర్లాం, నర్సిపురం, కోనాడ, పూసపాటిరేగ, నిడగల్లు, సొసైటీల్లో అక్రమాల నిగ్గు తేల్చారు. సెక్షన్ 53 ప్రకారం గొట్లాం పీఏసీఎస్‌లో విచారణ నిర్వహించి అక్రమాల్ని వెలికి తీశారు. ఇందులో రూ.కోటి 3లక్షల మేర అక్రమాలు జరిగి నట్లు బహిర్గతమైంది. పీఏసీఎస్‌లతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్, విజయా సొసైటీ, రైల్వే ఉద్యోగుల సహకార సొసైటీల్లో కూడా 51స్టాట్యుటరీ విచారణలు జరిగాయి.వీటిలో కూడా అక్రమాలు తేలాయి. ఎన్ని విచారణలు జరిగినా, అవతవకలు నిగ్గు తేల్చినా, బాధ్యులపై చర్యలు తీసుకున్నా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. దీనికంతటికీ సంఘాల రికార్డులు సక్రమంగా లేకపోవడం, అంతా మాన్యువల్‌గా జరగడమేనని తెలుస్తోంది. ఇప్పుడా కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు సహకార శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అన్ని సహకార బ్యాంకుల కార్యకలాపాలూ.. పీఏసీఎస్ దగ్గర నుంచి డీసీసీబీ, సహకార కేంద్ర కార్యాలయం వరకు కార్యకలాపాలన్నీ ఆన్లైన్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఎక్కడేం జరుగుతోందో గమనించొచ్చు. లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. దీంతో సంఘాల ఆదాయ, వ్యయాలపై ప్రతిరోజూ స్పష్టత ఉంటుంది. అలాగే, సహకార సంఘాల రికార్డులన్నీ కంప్యూటరీకరణ చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఈమేరకు సంఘాలకు కంప్యూటర్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించనున్నారు. ఇకపై సంఘాల సభ్యత్వం గల రైతులందరికీ మంజూరు చేసిన రుణమొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఆ మొత్తాన్ని సహకార శాఖ ఇచ్చే కార్డుతో ఏ బ్యాం కు ఏటీఎంలోనైనా డ్రా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.