పర్మినెంట్‌కు పంగనామాలు!

Contract Workers Not Regular In TTD Employees - Sakshi

టీటీడీ.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ. అలాంటి ఆధ్యాత్మిక సంస్థలో పర్మినెంట్‌ పోస్టుల భర్తీ ఇక తీరని కలేనా.. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందే మేలని టీటీడీ భావిస్తోందా? ధార్మిక సంస్థ తీరు తెన్నులు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. టీటీడీ పరిధి పెరుగుతున్నా పదేళ్లుగా భర్తీకాని పోస్టులు, పెరుగుతున్న కాంట్రాక్టు కార్మికులు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు సంస్థ ఆదాయ, వ్యయాల మధ్య లోటును తగ్గించడానికి టీటీడీ ఆర్థిక శాఖాధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. 

తిరుమల: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 1933లోనే అప్పటి బ్రిటిష్‌ పాలకులు ఏర్పాటుచేసిన వ్యవస్థ టీటీడీ. 1999లోనే టీటీడీ  శాశ్వత ఉద్యోగులు 16 వేలకుపైనే. అప్పట్లో శ్రీవారి దర్శనార్థం  నిత్యం విచ్చేసే భక్తులు  15 వేలు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో  శ్రీవారి దర్శనార్థం  విచ్చేసే భక్తుల సంఖ్య 70 నుంచి 80 వేలకు చేరుకుంది.  సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్ష పైగానే. రద్దీకి అనుగుణంగా శాశ్వత ఉద్యోగులు పెరగాల్సి ఉండగా, టీటీడీలో భిన్నంగా తగ్గిపోతూ వస్తోంది. పర్మినెంట్‌ పోస్టుల  స్థానంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తీసుకుంటున్నారు. వాస్తవానికి ఏ సంస్థలోనైనా శాశ్వత ఉద్యోగుల సంఖ్యతో పోల్చితే కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సంఖ్య 30 శాతం మించకూడదు. కానీ టీటీడీలో మాత్రం శాశ్వత ఉద్యోగులు దాదాపుగా 7 వేలకు పడిపోతే, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సంఖ్య 15 వేలు దాటేసింది.

లోటు బడ్జెట్‌ కారణంతోనేనా..?
టీటీడీలో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వైపు పరుగులు తీయడానికి టీటీడీ ఆర్థిక పరిస్థితే కారణంలా కనిపిస్తోంది.  ఘనంగా రూ.2,950 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ని ప్రవేశపెట్టినా వాస్తవానికి టీటీడీ లోటు బడ్జెట్‌లో ఉంది. శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకులను కార్పస్‌ ఫండ్‌గా పేర్కొన్న టీటీడీ వాటిని మొత్తంగా ఫిక్స్‌డ్‌  డిపాజిట్స్‌గా వేయాలి. నిబంధనలు మేరకు కనీసం 60 శాతం నిధులను తప్పనిసరిగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా చేయలి. కానీ గత రెండేళ్లుగా  టీటీడీ  ఫిక్స్‌డ్‌ æడిపాజిట్లలో కోత పెడుతోంది. 2016–17కి గాను రూ.757 కోట్లు డిపాజిట్‌ చేయాల్సి ఉండగా రూ.475 కోట్లు మాత్రమే చేసింది.   2017–18కి గాను రూ.533 కోట్లను అంచనాల్లో చూపించగా రూ.268 కోట్లు మాత్రమే  డిపాజిట్‌ చేసింది.

ఇక ఈ ఏడాది అంచనాల్లో రూ.200 కోట్లు మాత్రమే చూపించింది. టీటీడీ గత అనుభవాలతో చూస్తే ఈ ఏడాది అసలు ఒక్క రూపాయి కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌  చేసే అవకాశం లేదు. టీటీడీకి సంబంధిం చి ప్రధాన ఆదాయ వనరులు హుండీ కానుకల ఆదాయం, డిపాజిట్లపై వచ్చే వడ్డీ, ఆ రెండు కలిపితేనే దాదాపుగా రూ.1900 కోట్ల వరకు చేరుకుంటుంది. హుండీ ఆదాయం దాదాపుగా గత మూడేళ్లుగా ఇంచుమించు రూ.1100 కోట్లు మాత్రమే లభిస్తోంది. అటు తర్వాత ప్రధాన ఆదాయంగా వచ్చే ఫిక్స్‌డ్‌  డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని బ్యాంకులు తగ్గించడంతో ఇప్పటికే రూ.800 కోట్ల్ల వరకు వస్తున్న వడ్డీ ఇప్పుడు రూ.750 కోట్లకు తగ్గిపోయింది.

ఇక టీటీడీలో ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు చెల్లించే జీతభత్యాలు రూ.900 కోట్లకు చేరుకున్నాయి. ఇలా టీటీడీ వ్యయం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఆదాయం, వ్యయాల మధ్య లోటు ఏర్పడుతోంది. దీంతో టీటీడీ ఆర్థిక శాఖాధికారులు టీటీడీలో శాశ్వత ఉద్యోగుల కంటే కాంట్రా క్ట్‌ ఉద్యోగులే ముద్దు అన్నట్టుగా అడుగులు వేస్తున్నారు. టీటీడీలోని 7వేల మంది ఉద్యోగులకు రూ.300 కోట్లు, పెన్షన్‌దారుల కోసం మరో రూ.300 కోట్లు వెచ్చిస్తుండగా, 13 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు రూ.215 కోట్లు మాత్రమే చెల్లించి టీటీడీ చేతులు దులుపుకుంటోంది.

పరిధి పెరుగుతున్నా భర్తీ కాని పోస్టులు
కొన్నేళ్లుగా టీటీడీ పరిధిలో భర్తీకాని పోస్టుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ధర్మప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ నూతనంగా ఆలయాలను నిర్మిస్తోంది. ఇప్పటికే కురుక్షేత్రం, కన్యాకుమారిలో నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయాలను ప్రారంభించగా, మార్చిలో హైదరాబాద్‌లో ఆలయాన్ని ప్రారంభించనుంది. దీంతో పాటు అమరావతి, భువనేశ్వర్, వైజాగ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా టీటీడీ శరవేగంగా శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులను కొనసాగిస్తోంది. ఇలా రోజురోజుకు టీటీడీ పరిధి పెరుగుతున్నా అందుకు అనుగుణంగా ఉద్యోగుల భర్తీపై మాత్రం టీటీడీ ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం లేదు.

పెరుగుతున్న పని భారం
గత  పదేళ్ల నుంచి పైగా టీటీడీలో ఉద్యోగుల భర్తీని చేపట్టకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం అధికమవుతోంది. ప్రతి నెలా ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో పనిభారం పెరుగుతోంది. దీంతో కొంతమంది ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కాంట్రాక్టుపరం చేస్తే ఊరుకోం
తరతరాలుగా కొనసాగుతున్న హిందూధార్మిక సంస్థ టీటీడీలో కొన్ని విభాగాలను ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించాలని చూస్తే ఒప్పుకోం. ఇప్పటికే దేశంలో అనేక ప్రభు త్వ రంగసంస్థలు ప్రైవేటు పరం కావడంతో ఇటు ఉద్యోగులకు, అటు ప్రజలకు సౌకర్యాలు పెరగకపోగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ధార్మిక విలువలు తెలిసిన టీటీడీ వ్యవస్థలో కీలకమైన విభాగాలను కాంట్రాక్టు పరం చేస్తే ధార్మికతకు విలువుండదు.  – గోల్కొండ వెంకటేశం, టీటీడీ ఎంప్లాయీస్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ సెక్రటరీ

ఉద్యోగుల వ్యతిరేక చర్య
80 ఏళ్ల సుదీర్ఘ ధార్మిక చరిత్ర కలిగిన టీటీడీలోని కొన్ని విభాగాలను కాంట్రాక్టు సిబ్బందితో నింపాలనుకోవడం ఉద్యోగుల వ్యతిరేక చర్యలో భాగం. ఇప్పటికే ఉద్యోగులు పని ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ ధార్మిక సంస్థ నిబంధనలతో సేవలను కొనసాగిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ పెరిగితే ఉద్యోగులు పనిచేయలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ విధానాన్ని ఎట్టి  పరిస్థితుల్లో అంగీకరించం. – చీర్ల కిరణ్, టీటీడీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top