ఆకాశానికి చిల్లు!

Continues Rainfall In Anantapur From Two Days - Sakshi

‘అనంత’ జలకళ సంతరించుకుంది. పది రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కరువుసీమ పులకిస్తోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఒక్కరోజే రికార్థు స్థాయిలో 36.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గత నాలుగేళ్లలో ఈ స్థాయి సగటు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.      

సాక్షి, అనంతపురం : వరుణుడి కరుణ కొనసాగుతోంది. సోమవారం రాత్రి ప్రారంభమమైన వాన మంగళవారం ఉదయం వరకూ తెరిపివ్వకుండా కురిసింది. కళ్యాణదుర్గంలో ఏకంగా 114.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గుంతకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, తాడిపత్రి, యాడికి తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాజా వర్షాలతో 27 మీటర్ల కనిష్ట స్థాయి క్షీణించిపోయిన భూగర్భజలాలు బాగా పెరిగే అవకాశం ఉండటంతో అన్నదాత ఇంట ఆనందం వ్యక్తమవుతోంది. ఎడతెరపి లేని వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెన్నా, చిత్రావతి లాంటి నదీ పరీవాహక ప్రాంతాలు కూడా కొంతమేర వర్షపునీరు పారుతోంది. పండమేరు, తడకలేరు, గాజులపల్లి వంక లాంటి ప్రధాన వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శింగనమల, గుంతకల్లు, రొద్దం, యాడికి లాంటి చెరువులు నిండిపోగా, వందలాది చెరువుల్లోకి అంతో ఇంతో నీరు చేరుతోంది. 
యాడికి మండలం పిన్నేపల్లి, కుందుర్పి మండలం రుద్రంపల్లి చెరువు, రొద్దం మండలం లోచర్ల చెరువుకు గండ్లు పడ్డాయి.  
⇔ బట్రేపల్లి, ఆలూరుకోన లాంటి కొండ ప్రాంతాలు, జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. నాసముద్రం చెరువు నిండిపోయి మరువ పారుతోంది.  
⇔ పెద్దవడుగూరు మండలం వెంకటాంపల్లిలో కొట్టంకూలి వైష్ణవి అనే ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది.  
⇔ యాడికి మండలం లక్ష్మంపల్లి గ్రామంలో వరద నీటికి ట్రాక్టరు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో యాడికి మండల కేంద్రంలో కాలనీలు జలదిగ్భంలో చిక్కుకున్నాయి. చేనేత కుటుంబాలకు చెందిన మగ్గాలు నీటమునిగాయి.  
⇔ కుందుర్పి పీహెచ్‌సీ ప్రహరీగోడ కూలింది. పట్టణాలు, మండల కేంద్రాల్లో లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు జలమయమయ్యాయి.  
⇔ కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలో నీటి ప్రవాహానికి నూర్జహాన్‌కు చెందిన కొట్టంతో పాటు దుస్తులు, బీరువాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. నగదు, బంగారునగలు గల్లంతు కావడంతో రూ.2.50 లక్షల మేర నష్టం జరిగినట్లు సమాచారం.  
అనంతపురం, యాడికి, పెద్దవడుగూరు, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కుందుర్పి, గుంతకల్లు, శింగనమల తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో వరి, వేరుశనగ, పత్తి, అరటి, టమాట, ఇతర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.  
పంట నష్టం, ఆస్తి, ప్రాణ నష్టంపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు.  

ధర్మవరం: కుణుతూరు వద్ద పొంగిపొర్లుతున్న చెక్‌ డ్యాం (ఇన్‌సెట్‌) యాడికి: జలదిగ్బంధంలో చిక్కుకున్న కాలనీలో సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు, 1. శెట్టూరు: భారీ వర్షానికి కోతకు గురైన లింగదీర్లపల్లి రోడ్డు, 2. విడపనకల్లు: డొనేకల్లు వద్ద 67వ నంబర్‌ జాతీయ రహదారిపై పోటెత్తిన పెద్దవంక 

వారం వ్యవధిలోనే 150 మి.మీ వర్షపాతం నమోదు 
సెప్టెంబర్‌ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటివరకూ 154.7 మి.మీ వర్షం కురిసింది. ఇక జూన్‌ ఒకటి నుంచి ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 304.1 మి.మీ వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 292.3 మి.మీతో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈనెల 15వ తేదీన 47 శాతం మేర లోటువర్షపాతం ఉండగా...అదిప్పుడు 4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. వారం రోజుల వ్యవధిలోనే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 150 మి.మీ మేర వర్షపాతం నమోదు కావడం విశేషం. 

జల దిగ్బంధంలో తొమ్మిది గ్రామాలు 
యాడికి: వర్షాలకు పిన్నేపల్లె చెరువుగట్టు తెగటంతో సోమవారం తెల్లవారుజామున 9 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక భారీ వర్షం కురవడం...ఎగువ నుంచి వచ్చిన నీరు కూడా వచ్చి చేరడంతో మండలంలోని రెడ్డివారిపల్లె, రామన్నగుడిసెలు, చండ్రాయుని పల్లెలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ నీరంతా పిన్నేపల్లె చెరువుకు చేరి చెరువుకు గండి పడింది. దీంతో నీరంతా పిన్నేపల్లె, యాడికిలోని ఎస్సీ కాలనీ, చౌడమ్మ గుడివీధి, ఆస్పత్రి కాలనీ, కొట్టాలపల్లె, వేములపాడు, తిమ్మాపురం గ్రామాల్లోకి భారీగా చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న  అధికారులు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. అనంతపురం ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, చెరువుకు గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించి...ఇరిగేషన్‌ అధికారులను అప్రమత్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top