ఆమెకు..రక్త ‘పరీక్ష’..! | Confusion on Blood test in srikakulam | Sakshi
Sakshi News home page

ఆమెకు..రక్త ‘పరీక్ష’..!

Oct 3 2014 8:58 AM | Updated on Sep 2 2018 4:48 PM

ఆమెకు..రక్త ‘పరీక్ష’..! - Sakshi

ఆమెకు..రక్త ‘పరీక్ష’..!

వైద్య వృత్తి వ్యాపారంగా మారుతోంది. రోగిని దోచుకోవడమే ధ్యేయంగా రక్త, మూత్ర, ఎక్స్‌రే పరీక్షలకు పురమాయించడం పరిపాటిగా మారింది.

వైద్య వృత్తి  వ్యాపారంగా మారుతోంది. రోగిని దోచుకోవడమే ధ్యేయంగా రక్త, మూత్ర, ఎక్స్‌రే పరీక్షలకు పురమాయించడం పరిపాటిగా మారింది. ఇక పుట్టగొడుగుల్లా..వెలసిన ల్యాబ్‌ల నిర్వాహకులు..తప్పుడు రిపోర్టులిస్తూ..దోచేస్తున్నారు. రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బొద్దాం గ్రామానికి  చెందిన ఓ గర్భిణికి నాలుగు చోట్ల..నాలుగు రకాలుగా బ్లడ్‌గ్రూప్‌ను నిర్ధారించారంటే..ల్యాబ్‌ల నివేదికల్లోని డొల్లతనం ప్రస్ఫుటమవుతోంది.   రాజాం రూరల్: రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన నిరుపేద గర్భిణి కొత్తపల్లి లక్ష్మీకి ఎవరూ ఊహించని కష్టం వచ్చి పడింది. విశాఖపట్నంకు చెందిన ఈమెకు ఏడాది క్రితం బొద్దాంకు చెందిన ఆదినారాయణతో వివాహమైంది.
 
 ప్రస్తుతం ఆమె నిండు చూలాలు. ప్రసవానికి సిద్ధపడుతున్న ఆమెకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.  రక్తహీనతతో బాధపడుతున్న లక్ష్మికి  ప్రసవ సమయంలో ఆపరేషన్ చేస్తే.. రక్తం అవసరం అవుతుందేమోనన్న భావనతో బ్లడ్‌గ్రూప్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. అయితే..ఒక్కో చోట ఒక్కో గ్రూపుగా నిర్ధారణ కావడంతో అంతా విస్తుపోతున్నారు. చివరికి ఆమెది ఏ గ్రూపో.. ఏ గ్రూపు రక్తం సేకరించాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.   తొలుత ఆమెను విశాఖలోని విక్టోరియా ఆస్పత్రిలో ఈ ఏడాది జూన్ 28న రక్త పరీక్ష చేయించగా.. ఓ నెగిటివ్‌గా నిర్ధారించారు.
 
 ఆ తర్వాత రాజాం సామాజిక ఆస్పత్రిలో జూలై 30న పరీక్ష నిర్వహించగా ఓ నెగిటివ్‌గానే వచ్చింది.  అనంతరం లక్ష్మి మలేరియా బారిన పడడంతో మళ్లీ రక్త పరీక్ష నిర్వహించి..ఓ నెగిటివ్‌గా మళ్లీ నిర్ధారించారు.  అయితే..సెప్టెంబర్ 23న రాజాంలోని చాందిని డయగ్నోస్టిక్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా..బి-పాజిటివ్ రావడంతో అంతా విస్తుపోయారు. ఇదేంటి ఇలా జరిగింది..మరోసారి నిర్ధారించుకుందామని రాజాం జీఎంఆర్ కేఆర్ ఆస్పత్రిలో ఒకే రోజు మూడు సార్లు రక్త పరీక్ష నిర్వహించగా..ఓ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  మూడు చోట్ల మూడు రకాల గ్రూపింగ్‌లు రావడంతో.. ఆశ్చర్యానికి గురై..మరోసారి రాజాంలోని  ఆర్‌ఆర్ డయగ్నోస్టిక్ సెంటర్‌లో పరీక్ష చేయించుకుంటే ఓ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
 
 అంతా అయోమయం
 ఎందుకైనా మంచిదని కుటుంబ సభ్యులు గతంలో బి పాజిటివ్‌గా నిర్ధారించిన చాందిని డయగ్నోస్టిక్‌లో మరోసారి పరీక్షించుకోగా..ఓ పాజిటివ్‌గా తేల్చారు.దీంతో లక్ష్మి  కుటుంబం అయోమయానికి గురవుతోంది.  ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.  హిమోగ్లోబిన్ శాతం కూడా తక్కువగా ఉండడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద రజక కుటుంబానికి చెందిన తాము..ఆపరేషన్ సమయంలో రక్తం అవసరమొస్తే..ఏ గ్రూపు రక్తం తేవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి..తమకు న్యాయం చేయాలని, తప్పుడు నివేదికలు ఇస్తూ..అయోమయానికి గురిచేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement