ఇలాగైతే ఇంటికి పంపుతా

Collector Satyanarayana Fires On Officials - Sakshi

ఉపాధి హామీ పథకం అధికారులను హెచ్చరించిన కలెక్టర్‌ సత్యనారాయణ

ఆదోని: ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపుతానని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ హెచ్చరించారు. బు«ధవారం పట్టణంలోని ఎంపీడీవో సమావేశం హాలులో ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లతో సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి లేక పోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు కల్పించకపోవడంతో ఆదోని డివిజన్‌ పరిధిలోని మండలాల నుంచి ప్రజలు ఎక్కువగా వలసలు పోతున్నారన్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నా.. సిగ్గు అనిపించదా? బుద్ధి ఉన్నోళ్లు ఎవరైనా స్పందించకుండా ఉంటారా? అని మండి పడ్డారు. వలసల నివారణచకు చర్యలు తీసుకోకపోతే బాధ్యులను ఇంటికి పంపుతానని హెచ్చరించారు.

ఐదు మండలాల్లో మార్చి చివరి లోగా 175 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా 125 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారన్నారు. సీనియర్‌ మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు   సక్రమంగా పనిచేయడం లేదని మంత్రాలయం, పెద్దకడుబూరు ఎంపీడీవోలు ఫిర్యాదు చేయగా.. పూర్తి వివరాలతో నివేదిక పంపితే చర్యలు తీసుకుంటానని కలెక్టరు చెప్పారు. ఎండలు మండుతున్నందున ఉదయం, సాయంత్రం మాత్రమే పనులు చేపట్టాలని సూచించారు. కూలీలు పని చేసే చోట తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మజ్జిగ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆదోని డివిజన్‌లో తాగు నీటి వనరులపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ రామస్వామితో చర్చించారు. వేసవిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  సమావేశంలో డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ ఓబులేసు, అదనపు పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ మల్లేశ్వరి,  ఏపీవోలు మన్న, మద్దిలేటి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top