కలెక్టర్, జేసీ బదిలీకి రంగం సిద్ధం | Collector JC transfer prepare | Sakshi
Sakshi News home page

కలెక్టర్, జేసీ బదిలీకి రంగం సిద్ధం

Jul 30 2014 1:21 AM | Updated on Mar 21 2019 8:35 PM

కలెక్టర్, జేసీ బదిలీకి రంగం సిద్ధం - Sakshi

కలెక్టర్, జేసీ బదిలీకి రంగం సిద్ధం

జిల్లాలో ఇద్దరు ఐఏఎస్‌ల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. ఒకరు బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తికావడంతో బదిలీ అనివార్యమవుతుండగా, మరొకరు

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలో ఇద్దరు ఐఏఎస్‌ల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. ఒకరు బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తికావడంతో బదిలీ అనివార్యమవుతుండగా, మరొకరు జిల్లాకు వచ్చి ఏడాది పూర్తి అయ్యిందో లేదో సాగనంపేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. నిజాయితీగా పనిచేస్తుండడమే ఆ అధికారి చేసిన తప్పు అయింది. వీరిలో ఒకరు జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్. మరొకరు జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాలరాజు. వీరిద్దరూ తాజాగా రూపొందించిన బదిలీల జాబితాలో ఉన్నారు.కలెక్టర్‌గా నీతూకుమారి జిల్లాకు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయింది. ఆమె 2012 ఫిబ్రవరి 25న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా ఆమె వచ్చారు.
 
 నీతూకుమారితో పాటు ఆమె భర్త రాజేష్‌కుమార్ ఏపీఎస్‌పీ కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా వచ్చారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరు అర్బన్ జిల్లాకు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఈ క్రమంలో కలెక్టర్ నీతూకుమారి కూడా బదిలీ కానున్నారని అధికారవర్గాల సమాచారం. భర్త గుంటూరు జిల్లాలో పనిచేస్తుండడంతో ఆమెను గుంటూరు లేదా, కృష్ణాజిల్లాకు బదిలీ చేయనున్నారని కలెక్టరేట్ వర్గాల ద్వారా తెలియవచ్చింది. రాష్ట్ర విభజనతో ఐఏఎస్‌ల నుంచి ఆప్షన్‌లు కోరిన సందర్భంలో నీతూకుమారి తెలంగాణ  కోసం ఆప్షన్ ఇచ్చారని సమాచారం. ఇంతలో భర్త రాజేష్‌కుమార్ గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీగా వెళ్లడంతో ఆమె కూడా ఆ పరిసర జిల్లాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని తెలియవచ్చింది.
 
 ఇందుకు అనుగుణంగా గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. వారం, పది రోజుల్లో బదిలీపై స్పష్టత వస్తుందని సమాచారం.కాగా, కలెక్టర్ కంటే ముందే జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజును సాగనంపాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఐఏఎస్‌లో టాప్ ర్యాంకర్, బీసీ సామాజికవర్గానికి చెందిన ముత్యాలరాజు అధికార పార్టీ నాయకులు చెప్పే అడ్డగోలు పనులు చేయడానికి అంగీకరించకపోవడంతోనే కక్షకట్టి ఆయన బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారని కలెక్టరేట్ వర్గాలు కోడైకూస్తున్నాయి. జేసీగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తి అయ్యిందో లేదో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఆగ్రహానికి గురైన ఆయనకు బదిలీ వేటు తప్పేట్టు కన్పించడం లేదు.
 
 రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తూ జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా 2013 జూలై ఒకటిన ముత్యాలరాజు వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే కాకినాడ, రాజమండ్రి సహా పలు ప్రధాన ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు సాగించిన భూ కబ్జాలపై కొరడా ఝుళిపించడంతో నేతలు జేసీపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా రేషన్ డిపోలకు నిర్వహించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో కర్రపెత్తనం చేసి అనుయాయులకు రేషన్ షాపులు కట్టబెట్టాలనే నేతల ప్రయత్నాలకు జేసీ అడ్డుకట్ట వేశారు.
 
 రేషన్‌డిపోల భర్తీలో ‘చౌకడిపోలకు పచ్చముద్ర’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై జేసీ స్పందించి రాజమండ్రి, కాకినాడ రెవెన్యూ డివిజన్‌లలో చౌకధరల దుకాణాల నియామకాలను రద్దు చేశారు. ఈ పరిణామం అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమైంది. ఆ క్షణం నుంచి జాయింట్ కలెక్టర్‌ను సాగనంపేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. జేసీ ఇక్కడే ఉంటే తమ ఆటలు సాగవనే అభిప్రాయానికి వచ్చిన నేతలు కత్తికట్టి బదిలీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీ కూడా వెళ్లిపోయేందుకైనా సిద్ధపడుతున్నారు తప్పితే వారు చెప్పే అడ్డగోలు పనులు చేసేందుకు సుముఖంగా లేరని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement