సీఎం వ్యక్తిగత సహాయకుడు అనారోగ్యంతో మృతి

CM YS Jaganmohan Reddy Pays Tributes To Narayana - Sakshi

అనారోగ్యంతో హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

స్వగ్రామమైన అనంతపురం జిల్లా దిగువపల్లికి భౌతికకాయం తరలింపు

నారాయణ హఠాన్మరణంతో చలించిన సీఎం వైఎస్‌ జగన్‌ 

ఢిల్లీ పర్యటన అర్ధంతరంగా ముగించుకుని దిగువపల్లికి రాక

సతీమణి భారతితో కలసి నారాయణకు నివాళి అర్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా 

సాక్షి ప్రతినిధి, అనంతపురం/ధర్మవరం/సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు దంపెట్ల నారాయణ యాదవ్‌(53) అనారోగ్యంతో మృతిచెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ 15 రోజులక్రితం హైదరాబాద్‌ సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చేరారు. గత ఐదు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతిచెందారు. మృతదేహాన్ని నారాయణ స్వగ్రామమైన అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలోని దిగువపల్లికి శుక్రవారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. తమ కుటుంబంతో మూడు దశాబ్దాలకుపైగా అనుబంధం కలిగిన నారాయణ హఠాన్మరణం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తీవ్రంగా కలిచివేసింది. ఢిల్లీలో ఉన్న ఆయన నారాయణ మృతి వార్త తెలియగానే తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని తిరుగుపయనమయ్యారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చి అక్కడినుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో నారాయణ స్వగ్రామమైన దిగువపల్లెకు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. జగన్‌ వెంట ఆయన సతీమణి వైఎస్‌ భారతి కూడా ఉన్నారు. నారాయణ భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు నివాళులర్పించారు. నారాయణ కుటుంబసభ్యులను ఓదార్చారు. నారాయణ భార్య భవాని, కుమారుడు వెంకటసాయి కృష్ణ (22), కూతురు లిఖిత(20), తల్లి సాలమ్మ తదితరులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఏ కష్టం రాకుండా చూసుకుంటామని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, కలెక్టర్‌ గంధం చంద్రుడు తదితరులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వెంట ఉన్నారు. నారాయణ మృతదేహానికి శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
నారాయణ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న సీఎం వైఎస్‌ జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతి 

వైఎస్‌ కుటుంబానికి నమ్మినబంటు
దంపెట్ల నారాయణ యాదవ్‌ దాదాపు 36 ఏళ్ల క్రితం తన 17వ ఏటనే.. వైఎస్‌ జగన్‌ తాతగారైన వైఎస్‌ రాజారెడ్డి వద్ద సహాయకుడిగా, కారు డ్రైవర్‌గా చేరారు. తదనంతరం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వద్ద నమ్మినబంటుగా ఉండేవారు. ఆ తరువాత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కారు డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకునిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు జగన్‌ వెన్నంటి ఉండేవారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఆద్యంతం నారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా రెండుసార్లు నారాయణ అస్వస్థతకు గురవగా ఆస్పత్రిలో చేర్పించారు.

ఇందులో ఒకసారి హైదరాబాద్‌కు విమానంలో పంపినట్లు, ఆసుపత్రి వారికి జగనే ఫోన్‌చేసి ‘నారాయణ నాకు కావాల్సిన వ్యక్తి.. ఆయనకు ఏ ఇబ్బంది రాకూడదు.. అన్నీ దగ్గరుండి చూసుకోండని చెప్పార’ని నారాయణే ఒక ఇంటర్వూలో గర్వంగా చెప్పారు. నారాయణ చికిత్స పొందుతున్న సమయంలో చాలా సార్లు వైఎస్‌ విజయమ్మ, భారతి పరామర్శించారు. వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయడమేగాక వైద్యులతోనూ మాట్లాడేవారంటూ దంపెట్ల కుటుంబసభ్యులు గుర్తు చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top