ఏపీ చరిత్రలో ఇవాళ ముఖ్యమైన రోజు: సీఎం జగన్‌

CM YS Jagan Speech At Special Assembly Session - Sakshi

వికేంద్రీకరణ బిల్లుపై శాసనసభలో చర్చ

టీడీపీ చేసిన తప్పుల్ని సరిదిద్దుతున్నాం

గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగొద్దు

అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే ఈ నిర్ణయం

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది

రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి :  అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే అభివృద్ధి వికేంద్రీకరణకు ఓటేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, అమరావతి లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌, కర్నూలు జ్యూడీషియల్‌ క్యాపిటల్‌గా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అమరావతికి అన్యాయం చేయడం లేదని, మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ నేతలకు రైతులపై ప్రేమలేదని అన్నారు. ఇలాంటి వారు ప్రపంచ చరిత్రలోనే ఉండరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను పోగొట్టుకున్నామని గుర్తు చేశారు. వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన శాసన సభలో సోమవారం మాట్లాడారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే...

ఏపీ చరిత్రలో ఇవాళ ముఖ్యమైన రోజు
‘ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇది ముఖ్యమైన రోజు. ఈ రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి గల కారణం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నన్ను మాట్లాడనీయకుండా చేస్తున్న టీడీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ మా ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు అనేకంటే..  దిద్దుబాట్లు అనడం కరెక్ట్‌. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్‌1న కర్నూలు రాజధానిగా అవతరించిన నాటి నుంచి 2014 జూన్‌లో 13 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించేంత వరకు... ఆతర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే... రకరకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి.

1953లో ఆంధ్ర రాష్ట్రంగా అవతరిస్తూ మద్రాసును పోగొట్టుకున్నాం. ఆ తర్వాత కర్నూలును త్యాగం చేశాం. ఆ తర్వాత హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం. ఒక అభివృద్ధి కేంద్రంగా, ఉద్యోగాల కేంద్రంగా ఉన్న నగరాలను పోగొట్టుకున్న ఏకైక రాష్ట్రం మనదే. చివరకు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడిన ఓ పెద్ద మనిషి వల్ల పోగొట్టుకున్నాం’  అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌..
కాగా, టీడీపీ సభ్యుల గందగోళంతో ముఖ్యమంత్రి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సీఎం తన ప్రసంగాన్ని కాసేపు నిలుపుదల చేశారు. టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యులను స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్‌ చేసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

శ్రీకృష్ణ కమిటీ కూడా అదే చెప్పింది 
‘1937లో శ్రీబాగ్‌ ఒప్పదం జరిగింది. గతంలో 1937లో అప్పట్లో మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉండగా.. తెలుగువారంతా ఒకటి కావాలి అని ఆరోజు శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ నుంచి పోతిరెడ్డి, కల్లూరి సుబ్బారావు లాంటి ప్రముఖ నాయకులు.. ఆంధ్ర నుంచి కాశీనాథుని నాగేశ్వరావు, కొండా వెంకటప్పయ్య లాంటి ప్రముఖులు ఒక చోట ఏకమై.. 1937లో శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని, అన్నదమ్ములుగా బతకాలని, ప్రాంతాల మధ్య గొడవల రావొద్దని తాపత్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, రాజధానులు ఎక్కడ ఉండాలనేదాటిపై చర్చ జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. హైకోర్టు, రాజధాని వంటివి ఒకే ప్రాంతంలో ఉండడం కరెక్ట్‌ కాదని, వేర్వేరు ప్రాంతాలల్లో ఏర్పాటు చేయాలని ఒడంబికలో రాసుకున్నారు.

దాంట్లో భాగంగానే 1953లో కర్నూలును రాజధానిగా చేశారు.1956దాకా అదే రాజధానిగా ఉంది. 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు జస్టీస్‌ శ్రీకృష్ట కమిటీ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో అనేక అంశాలపై అధ్యయనం చేసింది. ప్రాంతీయ అసమానతలు, ఉద్యోగాల పరంగా అసమానతలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ఆ నివేదిక వెల్లడించింది. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృది రాహిత్యం వల్ల వస్తే.. రెండవ సారి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుందో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు పేర్కొంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

చంద్రబాబు తీరును శివరామ కృష్ణనే తప్పుపట్టారు 
‘రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడానికి వీల్లేదని శిమరామకృష్ణ కమిటీ చెప్పింది. దీనిని చంద్రబాబు వక్రీకరించి చెప్పారు. సూపర్‌ క్యాపిటల్‌ వద్దని కమిటీ చెప్పింది. మూడు ప్రాంతాల్లో పాలనా వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించింది. శివరాకృష్ణ తాను రాసిన వ్యాసాల్లో కూడా చంద్రబాబు తీరును తప్పుబట్టారు. చంద్రబాబు తీరు ఏపీకి ఆత్మహత్య సదృశంగా మారింది’అని సీఎం అన్నారు.

టీడీపీ నేతలు ఎందుకు అక్కడ భూముల కొనలేదు
‘మేము అధికారలోకి వచ్చిన తర్వాత బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) రిపోర్టు కానీ, జీఎన్‌ రావు కమిటీ నివేదిక గానీ వికేంద్రీకరణకే ఓటేశాయి. గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ హైపవర్‌ కమిటీ సూచనలు కూడా చేసింది. గత ఒప్పందాలతో కానీ, గత చరిత్రతో కానీ, కమిటీ నివేదికలతోగానీ సంబంధం లేకుండా 2015లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారు. వస్తూ వస్తూ ఎవరికి ఏ అనుమానం రాకుండా తన వారితో, తన బినామీలతో, చివరకి తన పేరుతో కూడా ఈ ప్రాంతంలో వేల ఎకరాలు భూములు కొనుగోలు చేశారు. 

అందరికీ నూజివీడు దగ్గర రాజధాని అని చెప్పి భ్రమలు కల్పించారు. నాగార్జున యూనివర్సీటీ ప్రాంతంలో రాజధాని అని వారి పత్రికల్లో రాయించారు. వీళ్లు లీకులు ఇచ్చారు కాబట్టే పత్రికల్లో ఆ రాతలు వచ్చాయి.  ఇలా రాతలు వచ్చినా కూడా..  ఇదే తెలుగు దేశం నాయకులు నూజీవీడు, నాగార్జున యూనివర్సీటీ ప్రాంతాల్లో ఎందుకు భూములు కొనుగొలు చేయలేదు..? నోటిఫికేషన్‌కు ముందే టీడీపీ నేతలకు రాజధాని ఏర్పాటు చేయబోయే గ్రామాల పేర్లు చెప్పారు. అందుకే అందరూ అక్కడ భూములు కొన్నారు. రాజధాని కోసం భూములా లేక చంద్రబాబు, ఆయన మనుషులు కొన్న భూముల కోసం రాజధానా..?’అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.


అక్కడే భూములు ఎలా కొన్నారు?
‘చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను ప్రలోభ పెట్టి.. భయపెట్టి భూములు లాక్కున్నారు. మచిలీ పట్నంలో గత నాలుగేళ్లుగా 144 సెక్షన్‌ పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో 2016 నుంచి మా ప్రభుత్వం వచ్చేదాక 144 సెక్షన్‌ ఉంది. మా ప్రభుత్వం రెండు రోజులు 144 సెక్షన్‌ పెడితే నానా యాగీ చేస్తున్నారు. 29 గ్రామాల పరిధిలో 33వేల ఎకరాల భూములు తీసుకున్నారు. ఎవరైనా కూడా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎక్కడ పెడతాం? విజయవాడకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో పెడతాం. లేదా గుంటూరుకు సమీపంలో పెడతాం.

కానీ ఇక్కడ ఎం జరిగింది. పచ్చగా మూడు పంటలు పండే గ్రామాలు... విజయవాడకు, గుంటూరుకు చాలా దూరంలో ఉన్న గ్రామాల్లో.. రోడ్డు కూడా సరిగా లేని గ్రామాల్లో కావాలని భూములు కొన్నారు ఎందుకు? ఇక్కడే భూములు కొనాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? ఇదంతా చంద్రబాబు సీఎం అయ్యాక జరిగింది. రాజధాని ఇక్కడ వస్తుందని ప్రజలకు తెలియదు.. కానీ టీడీపీ నేతలకు మాత్రమే తెలుసు. రైతులను మోసం చేసి 4070 ఎకరాల భూములు కొన్నారు’అని సీఎం టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

అందుకే నారాయణ కమిటీ
‘వరద ముప్పు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది. శివరామ కృష్ణ కమిటీ నివేదను నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు నారాయణ కమిటీ వేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను ఇవ్వకముందే చంద్రబాబు తన నిర్ణయాలను అమలు చేసేందుకు నారాయణ కమిటీ వేశారు. ఆ తర్వాత 9 నగరాలు నిర్మించబోతున్నామంటూ సినిమా చూపించారు. రాష్ట్రం మొత్తం నీటి కోసం, కూటి కోసం తపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం కోట్ల కోసం పరితపించారు’అని సీఎం వైఎస్‌ జగన్‌ చురకలంటించారు.

అమరావతి పేరుతో భ్రమరావతి కల్పించారు
గత ఐదేళ్లలో చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్‌ రాజధానిని నిర్మించాలంటే రూ.లక్ష కోట్లు కావాలి. అమరావతి పేరుతో ఒక భ్రమరావతి కల్పించారు. మౌలిక వసతుల కోసం లక్షా 9వేల కోట్లతో బాబు అంచనాలు వేశారు. రాజధాని నిర్మాణానికి రూ.4-5లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబే చెప్పారు. గతంలో అన్ని తాత్కాలికమని చెప్పి ఇప్పడు పర్మినెంట్‌ అంటున్నారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు చెప్పిన అమరావతిని నిర్మించాలంటే కనీసం 100 ఏళ్లు పడుతుంది. 30 ఏళ్లలో పూర్తి చేయాలనుకుంటే 5లక్షల 97వేల కోట్లు ఖర్చ అవుతుంది. గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఆదేశాలు, నది పరివాహక ప్రాంతాలు కావడం చేత ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌ రావాలంటే ఎకరం రూ.20కోట్లకు పోవాలి. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. 

ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు
రాజధాని నగరంలో కనీస సదుపాలయలేకే లక్ష 9వేల కోట్లు పెట్టగలికే ఆర్థిక పరిస్థితి మనకు లేదు. రూ. 2.57లక్షల కోట్ల అప్పులతో మా పరిపాలన ప్రారంభించాం. రూ.21వేల కోట్లకు పైగా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించాలి. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ భారం ప్రజలపై పడకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నా. ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరో లక్ష కోట్లు రాజధాని కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉందా అందరూ ఆలోచన చేయాలి. కృష్ణా నదిపై 8 జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కృష్ణాలోకి తీసుకొచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో  కూడా మాట్లాడాం. తక్కువ డబ్బుతో ఎక్కువ నీళ్లు ఎలా తీసుకురావాలో ఆలోచన చేశాం. ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులను చెద్దామా వద్దా? వెనుక బడిన ఉత్తరాంధ్రకు ఊపిరి పోసే ప్రాజెక్టు. ఉత్తరాంధ్ర సజల స్రవంతి వస్తే ఆ ప్రాంత వెనుకబాటు తనం పోతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.16వేల కోట్లు ఖర్చు అవుతుంది. కరువు నివారణ కోసం కాల్పలు వెడల్పు చేసి ప్రాజెక్టుల సామర్థ్యం పెంచాలి. కరువు నివారణ పనుల కోసం రూ.25వేల కోట్లు ఖర్చవుతుంది. రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు 10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.36వేల కోట్టు ఖర్చు చేస్తున్నాం.

సంక్షేమం వద్దా..!
రాష్ట్రంలోని బడులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక దారుణమైన పరస్థితుల్లో ఉన్నాయి. వాటి బాగుకోసం రూ.24 కోట్లు అవసరం. ప్రభుత్వాస్పత్రుల బాగు కోసం మరో రూ.14 వేల కోట్ల ఖర్చవుతుంది. వాటర్‌గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు అందించేందుకు రూ.45 వేల కోట్లు ఖర్చవుతుంది. ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తాం. ఇందుకు రూ.40 వేల కోట్లు ఖర్చవుతుంది. 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 43 లక్షల మంది తల్లులకు అ‍మ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.  90 శాతం మందికి ఆరోగ్య శ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్‌ సదుపాయం కల్పిస్తున్నాం. ఇన్ని ఖర్చుల మధ్య ఒక ప్రాంత అభిృద్ధికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా..? 

రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేసి.. ఒక నగరానికి ఖర్చు చేయడం సాధ్యమేనా..? ఏదో ఒక రోజు అమరావతి కూడా మహానగం అవుతుంది. అందుకోసమే అసెంబ్లీని అమరావతిలోనే కొనసాగిస్తున్నాం. ఈ ప్రాంతంపై కోపం ఉంటే ఇక్కడే అసెంబ్లీ ఎందుకు పెడతాం. నేను కూడా సింగపూర్‌ నుంచి ఒకరిని.. జపాన్‌ నుంచి ఒకరిని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేయను. మన దగ్గర పరిమిత సొమ్ముని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో చూడాలి. విశాఖ ఇప్పటికే రాష్ట్రంలో నెంబర్‌వన్‌ నగరం. విశాఖ రాజధాని అయితే పదేళ్లలో హైదరాబాద్‌తో మన పోటీ పడొచ్చు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు.

అందరికీ మంచి చేయాలన్నదే నా విధానం
పట్టా భూములను ఇచ్చిన రైతులతో సమానంగా అసైన్డ్‌ భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తాం. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వడంతోనే మాకు 151 సీట్లు వచ్చాయి. జగన్‌ కమ్మవారికి వ్యతిరేకమని చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. విశాఖలో కమ్మవారు లేరా? విశాఖలో మా ఎంపీ కూడా కమ్మే. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు.. కమ్మవారిలో అభద్రతా భావాన్ని పెంచేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. రాజకీయం కోసం కులాన్ని వాడుకునే నీచ స్థాయికి బాబు దిగజారారు. అందరికీ మంచి చేయాలన్నదే నా విధానం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే అభివృద్ధి వికేంద్రీకరణకు ఓటేసున్నాం.

అమరావతికి అన్యాయం చేయడం లేదు
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చారని ఆరోపించింది. తెలుగు బీజేపీ నేతలు తెలిసి మాట్లాడుతున్నారో...తెలియక మాట్లాడుతున్నారా? అలాంటి వ్యక్తులను పార్టీ నుంచి బయటకు పంపించాలి. పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.830 కోట్లను ఆదా చేశాం.2021 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. శరవేగంగా పోలవరం ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అమరావతికి అన్యాయం చేయడంలేదు. అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరుగదు. అమరావతి రైతులకు న్యాయమే చేస్తాం. అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది. లెజిస్లేటీవ్‌ రాజధానిగా ఉంటుంది. చట్టాలు ఇక్కడే చేస్తాం.. సభలు ఇక్కడే జరుగుతాయి. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుతాం. భావితరాల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని నిర్ణయాలు తీసుకుంటాం. దీనిలో భాగంగానే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం’   అని సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top