వాళ్లందరికీ వెంటనే ఈ పథకం వర్తింపజేస్తాం: సీఎం జగన్‌

CM YS Jagan Speech On Amma Vodi Scheme In Assembly - Sakshi

సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే విద్యారంగంలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమం అమ్మ ఒడి అని పేర్కొన్నారు. 82 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. జనవరి 9న తన పాదయాత్ర ముగిసిన రోజున ఈ గొప్ప కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.

ఈ పథకం ద్వారా ఒకేసారి తల్లుల అకౌంట్లలోకి రూ. 6028 కోట్ల రూపాయలు పంపించామని వెల్లడించారు. అర్హులై.. సాంకేతిక కారణాలతో లబ్ది పొందని మిగతా తల్లులకు వెంటనే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా మధ్యాహ్న భోజన పథకంలో కూడా మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘‘పిల్లలకు ప్రతీ రోజు ఒకేరకమైన భోజనం కాకుండా రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ప్రతీ సోమవారం సోమవారం- అన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, స్వీటు, చిక్కీ.. మంగళవారం- పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు... బుధవారం- వెజిటబుల్‌ రైస్‌, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ... గురువారం కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు.. శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ... శనివారం- అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగల్‌ ఉండేలా మెనూ రూపొందించాం. గోరుముద్ద పేరిట విద్యార్థులకు భోజనం అందజేస్తాం. అదే విధంగా పథకం సాఫీగా అమలు జరిగేలా... ఆయాల జీతం రూ. 1000 నుంచి రూ. 3 వేలకు పెంచాం. దీని వల్ల దాదాపు రూ. 344 కోట్ల భారం పడుతుంది’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.(ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్‌)

నాలుగంచెల వ్యవస్థ
ఇక మధ్యాహ్న భోజన పథకం పనితీరును పర్యవేక్షించేందుకు నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ’’పేరెంట్స్‌ కమిటీ నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తాం. ఇండిపెండెంట్‌ ఆడిట్‌ను కూడా రెగ్యులర్‌గా పరిశీలిస్తాం. ఎక్కడా అవినీతి ఉండకూడదనే ఉద్దేశంతో కోడిగుడ్లలో కూడా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా ప్రపంచంతో పిల్లలు పోటీ పడేలా రైట్‌ టు ఇంగ్లీష్‌​ మీడియం తీసుకువచ్చామని తెలిపారు. ‘‘ఇంగ్లీషు మీడియంతో పిల్లల చదువులు మారతాయి. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రారంభిస్తున్నాం. ఇంగ్లీషు మీడియంపై విద్యార్థులు, టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం. జనవరి 31లోగానే పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తిచేస్తాం. పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులుకు అందుబాటులో ఉంచుతాం. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచుతాం’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ప్రతీ పిల్లాడికి ఒక కిట్..
పాఠశాల విద్యార్థులకు మేలు చేసే విధంగా... నాడు-నేడు కార్యక్రమాన్ని తీసుకువచ్చామని సీఎం జగన్‌ అన్నారు. ‘‘45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లలో మార్పులు తేవాలి. అక్కడ మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాం. వాటి రూపురేఖలు మార్చివేస్తున్నాం’’ అని తెలిపారు. అదే విధంగా విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ విద్యార్థికి ఓ కిట్‌ అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ‘‘జూన్‌ 1న 36 లక్షల మందికి పిల్లలకు కిట్‌ అందిస్తాం. దీని ధర రూ. 1350. స్కూలు బ్యాగు.. మూడు జతల యూనిఫాంలు(బట్ట ఇచ్చి.. కుట్టుకూలీ కూడా ఇస్తాం).. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టుతో కూడిన కిట్‌ను విద్యా కానుక పేరిట అందజేస్తాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఫిబ్రవరి నెలలో వసతి దీవెన కింద.. హాస్టల్‌లో ఉండే పిల్లల తల్లికి రెండు దఫాల్లో రూ. 20 వేలు అందిస్తామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top