వలస కూలీల పట్ల ఉదారంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

వలస కూలీల పట్ల ఉదారంగా ఉండాలి

Published Thu, May 7 2020 3:26 AM

CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన కూలీలు ఇక్కడకు వచ్చేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రాని పరిస్థితులు ఉంటే.. వెనకడుగు వేయొద్దు. అవసరమైన పక్షంలో వారికి కూడా ప్రయాణ సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్‌ ఏర్పాటు చేసి.. భోజనం, తదితర సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేశారు. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తామంటే సహకారం అందించాలని, లేదా వారి రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే ప్రయాణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఈ విషయంలో సంకోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చొరవ తీసుకుని వారికి తగిన విధంగా సాయం చేయాలన్నారు. వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద ఒక్కో కూలీకి రూ.500 ఇవ్వాలని ఆదేశించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, వలస కూలీల తరలింపు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ధరలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన వలస కూలీలు, రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు విధానాలపై చర్చించారు. విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1.5 లక్షల మంది వచ్చే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్‌ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

క్వారంటైన్‌ సదుపాయాలపై దృష్టి పెట్టాలి
► మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్న వారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న వారికి కూడా క్వారంటైన్‌ సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. 
► విదేశాల నుంచి వస్తున్న వారిలో ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా వారిని వర్గీకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 
► మహారాష్ట్రలోని థానే నుంచి 1,000 మందికిపైగా వలస కూలీలు గుంతకల్లుకు వచ్చారని, వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. థానేలో కేసుల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా వీరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.
► సరిహద్దుల్లో 9 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని.. పోలీసులు, వైద్య బృందాలు సమన్వయం చేసుకుంటాయని అధికారులు తెలిపారు. డిశ్చార్జి కేసుకు సంబంధించి పటిష్టమైన ప్రొటోకాల్‌ పాటిస్తున్నామని, వరుసగా రెండు పరీక్షల్లో నెగిటివ్‌ వస్తేనే డిశ్చార్జి చేస్తున్నామని చెప్పారు.
► టెలి మెడిసిన్‌లో భాగంగా సబ్‌ సెంటర్లకు మందులు పంపించి.. డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ మేరకు వారికి  పంపిణీ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 
► రైతులకు అండగా నిలిచేందుకు తగినంత మేర పంటల సేకరణ జరగాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ రైతులు సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే స్పందించాలని, ఈ విషయంలో అ«ధికారులు అగ్రెసివ్‌గా ఉండాలని సూచించారు. 
► ఈ సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

విదేశాల నుంచి వచ్చే వారు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు చేరుకుంటారు. వారికి అక్కడే మెడికల్‌ స్క్రీనింగ్‌ చేయిస్తాం. మార్గదర్శకాల ప్రకారం వారిని క్వారంటైన్‌ చేసి పర్యవేక్షిస్తాం. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తాం.             
– సీఎంతో అధికారులు

వలస కూలీల తరలింపు ఖర్చు ప్రభుత్వానిదే
వివిధ పనులు, యాత్రలు, చదువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారిని తిరిగి సొంత గ్రామాలకు తరలించడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం పనుల కోసం తాత్కాలికంగా వెళ్లి ఇరుక్కుపోయిన వారిని మాత్రమే తరలిస్తామని, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారికి అనుమతులు లేవని స్పష్టం చేసింది. వీరి తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని, శ్రామిక్‌ రైళ్ల ద్వారా తరలించే వారి వ్యయాన్ని, భోజన వసతిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. 

తరలింపు నిబంధనలు ఇవి..
► ఇతర రాష్ట్రాలకు తాత్కాలికంగా పనుల కోసం వెళ్లి చిక్కుకుపోయిన వారికే అనుమతి 
► ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటూ సొంత గ్రామాలకు ఒకసారి వెళ్లిరావాలి అనుకునే వారిని అనుమతించరు
► శిబిరాల్లో ఉన్న వారి కోసం దగ్గరలో ఉన్న ప్రాంతం నుంచి శ్రామిక్‌ రైల్‌ను ఏర్పాటు చేస్తారు
► ఒకవేళ శిబిరాల్లో కాకుండా సొంతంగా వేరే చోట ఉంటే అదే రైల్లో ప్రయాణించడానికి అనుమతిస్తారు. దీనికి ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలి. 
► శ్రామిక రైళ్లకు అయ్యే వ్యయం, అందులో ప్రయాణికులకు భోజన వసతిని ఐఆర్‌సీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుంది
► రైల్లో వచ్చిన వారిని ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల ద్వారా శిబిరానికి లేదా వైద్య శిబిరానికి తరలిస్తారు
► రైల్లో తరలించేంత సంఖ్యలో లేకపోతే వారిని ప్రత్యేక బస్సులు ద్వారా తరలిస్తారు
► వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బృందాలను అత్యవసర కేసుల్లో మాత్రమే అనుమతిస్తారు.

Advertisement
Advertisement