కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన సేవలు

CM YS Jagan Review Meeting On Covid Care Centres in AP - Sakshi

రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణ చర్యలపై సమీక్షలో సీఎం జగన్‌

రోగులకు సదుపాయాలు, ఔషధాల్లో రాజీ పడకూడదు

కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటింటా ఆరా తీయాలి

హోం క్వారంటైన్‌లో ఉన్న వారి ఇళ్లకు కూడా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు వెళ్లాలి

వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని, అవసరమైన మందులు అందజేయాలి

ప్రభుత్వం అండగా ఉందన్న మనో ధైర్యం ప్రజల్లో కల్పించాలి

‘ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అన్ని సదుపాయాలతో మంచి చికిత్స అందించాలి. కొంత మంది హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు కాబట్టి ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు వారి ఇళ్లకు వెళ్లి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలి. వారికి అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇవ్వాలి. వారిలో మనోధైర్యం కలిగించాలి. ప్రభుత్వం వారికి అండగా ఉందన్న ధీమా కల్పించాలి’ - సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 కేర్‌ సెంటర్లలో నాణ్యమైన వైద్య సేవలందాలని, అన్ని సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లోనూ ఏ లోటు ఉండరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణ చర్యలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

రోగులకు సదుపాయాల విషయంలో, వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో ఔషధాలు అందించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు. కరోనా మైల్డ్‌ పాజిటివ్‌ కేసులకు సంబంధించి రోగులకు వైద్య సేవలందించేందుకు అన్ని జిల్లాలలో కనీసం 3 వేల నుంచి 4 వేల బెడ్లు సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

ఏర్పాట్లు బావుండాలి
► కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పించాలి. బెడ్లు, టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలి. రోజంతా వైద్య సేవలందేలా చూడాలి.
► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో కూడిన ఔషధాలు (మందులు) ఇవ్వాలి.
► కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా గుర్తించిన ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలి. 
► ఇళ్లలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలి. ఆ సమాచారాన్ని వైద్య అధికారులకు తెలియజేసి అవసరమైన వారికి పరీక్షలు చేయించి, చికిత్స అందించాలి.

మరింత అవగాహన పెంచాలి
► కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు (స్టిగ్మా) తొలగిపోయేలా వారికి మరింత అవగాహన కల్పించాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయడం, తగిన పరీక్షలు చేయించుకోవడం, ఇళ్లలోనే ఉండి చికిత్స పొందవచ్చన్న విషయాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి.
► ఈ మేరకు గ్రామ సచివాలయాల్లో కూడా హోర్డింగ్‌లు ప్రదర్శించాలి. వాటిపై అన్ని ఫోన్‌ నంబర్లు ఉండేలా చూసుకోవాలి.
► ఈ సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top