హోదా కేసులన్నీ ఎత్తేయండి

CM YS Jagan orders police officers about  AP Special Status Cases - Sakshi

హోదా అడిగిన వారిపై అన్యాయంగా దేశద్రోహం కేసులు పెట్టారు..

శాంతిభద్రతల సమీక్షలో పోలీస్‌ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

రాష్ట్రంలో శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం

దేశంలోనే ఏపీ పోలీస్‌ నంబర్‌ వన్‌ కావాలి

సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాలి

జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దు

దాబాల్లో లిక్కర్‌ అమ్మకుండా చూడాలి

పోలవరం నిర్వాసితులకు గ్రీవెన్స్‌డే

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గత సీఎం ముందు ప్లకార్డులు ప్రదర్శించారని దేశద్రోహం కేసులు పెట్టారు.. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా కోసం ఉద్యమిస్తే అన్యాయంగా కేసులు పెట్టి హింసించారు.. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? అందుకే ప్రత్యేక హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయండ’ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పరిశీలించిన సీఎం.. శాంతిభద్రతలకు సంబంధించిన కీలక అంశాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాలు హోదా ఉద్యమ కేసుల విషయాన్ని ప్రస్తావించారు. గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట ఓ కార్యక్రమంలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు దేశద్రోహం కేసు పెట్టారని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇలా వ్యవహరిస్తే వ్యవస్థల మీద నమ్మకం పోతుందని, తక్షణమే ఆ కేసులన్నీ ఎత్తివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 

మానవీయ కోణంలో పని చేయాలి
రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ అంశాన్ని ప్రతి ఉద్యోగి దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకొనిపోవాలని చెప్పారు. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలని, ప్రజా ప్రతినిధులను గౌరవించాలన్నారు. పాలనా వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు ముఖ్యమేనన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పు చేస్తే ఎవరైనా, ఎంతటి వారినైనా సహించవద్దని, చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దని చెప్పారు. వ్యక్తిగత ఇగోలు పక్కనపెట్టి అందరూ కలిసి పని చేయడం ద్వారా దేశంలోనే ఏపీ పోలీస్‌ వ్యవస్థను ప్రథమ స్థానంలో నిలపాలని దిశానిర్దేశం చేశారు.   

పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన  
‘ఎవరికైనా ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలి. మంచి పాలన కోసం మీరు తీసుకునే నిర్ణయాల పట్ల నా పూర్తి సహకారం ఉంటుంది. అప్పుడే సుపరిపాలన అందించగలం. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని మా నాన్న నేర్పించారు. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అందించాలని నిర్ణయించాం. కుటుంబంతో గడపాల్సిన అవసరం పోలీసులకు ఉంది. దీనివల్ల మరింత ఉత్తేజంతో వారు విధుల్లోకి వస్తారు. పోలీసు శాఖలో దిగువ స్థాయి వరకు వీక్లీ ఆఫ్‌ వర్తింపజేయాలి. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షన్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుదారులను గౌరవించేలా రిసెష్షన్‌ విభాగం ఉండాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. రాష్ట్రంలో ఇష్టానుసారం సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు.

నిర్వాసితుల సమస్యలపై స్పందించండి
పోలవరం నిర్వాసితుల సమస్యలపై అధికారులు మానవత్వంతో స్పందించి పనిచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా శాశ్వతంగా గ్రీవెన్స్‌ సెల్‌ పెట్టాలని నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. ఇందుకోసం ఒక ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేకంగా కేటాయించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ అత్యంత ప్రాధాన్యత కలిగినందున దాన్ని పూర్తి చేసేందుకు ఎలాంటి సహాయమైనా అందిస్తామని స్పష్టం చేశారు. 

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టండి..
సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమల్లో త్వరగా అడుగులు ముందుకు పడాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు ఉండకుండా చూడాలన్నారు. రహదారుల పక్కన ఉండే దాబాల్లో మద్యం అమ్మకాలను నివారించాలన్నారు. రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, భద్రతా నిబంధనలు, నియమాలపై రోడ్డు పక్కన హోర్డింగ్‌లు పెట్టించాలన్నారు. జరిమానాలు విధించే ముందు ట్రాఫిక్‌ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. విజయవాడ ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడానికి సరైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీనిపై సంబంధిత అధికారులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. 

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి 
రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు వెంటనే సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఐడీ అధికారులను ఆదేశించారు. బాధితులను త్వరితగతిన ఆదుకునేలా అగ్రిగోల్డ్‌ బాధితులు, యాజమాన్యం, సీఐడీతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1,150 కోట్ల పంపిణీతో పాటు అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనం వేగంగా జరగాలన్నారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి సంబంధించిన ఇతర ఆస్తులపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top