టూరిజం ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan To Hold Review Meeting On Tourism Department - Sakshi

ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉండేలా ఆ మేరకు చర్యలు

ఎంపిక చేసిన 15, 20 పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్ధలతో అభివృద్ధి

రాష్ట్రంలో అరుదైన హస్తకళల పరిరక్షణకు ఆదేశాలు

ఏటికొప్పాక, కొండపల్లి, కంళంకారీ తదితర అరుదైన కళాకారులకు ఆర్థిక సాయం

విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా సముదాయాలకు అధికారుల ప్రతిపాదనలు

అమరావతి : ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, యూత్‌ ఎఫైర్స్‌ శాఖలపై శుక్రవారం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాల్లో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్‌స్టార్‌ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజంతో పాటు చారిత్రక ప్రాంతాల అభివృద్ధి, అన్ని జిల్లాల్లో క్రీడా సదుపాయాల ఏర్పాటుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడు రాజస్థాన్‌ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారని, అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణమని అన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అభివృద్ధిచేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసిన తనకు వివరాలు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆతిథ్యరంగంలో, పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేలా ఇక్కడ ఉత్తమ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై సహజంగానే అంతర్జాతీయస్థాయిలో మంచి ప్రచారం లభిస్తుందన్నారు. అభివృద్ధి చేయాల్సిన పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత వాటిని మార్కెటింగ్‌ చేయడంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు.


ఇదే సమయంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించారు. పూర్తిస్థాయి వివరాలతో తనకు మళ్లీ సమాచారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.  గండికోట అడ్వెంచర్‌ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అక్కడ నదికి అడ్డంగా గ్లాస్‌తో ఒక వంతెన కూడా నిర్మించే ఆలోచన చేస్తున్నామని, పలు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు వివరించారు. తనకు సమర్పించే నివేదికలో ఈ ప్రతిపాదనలు అన్నింటినీ చేర్చాలని సీఎం సూచించారు.

పోలవరం, పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యాంలతో పాటు,  విశాఖ జిల్లాలో అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి ప్రాంతాల్లో  టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విశాఖలో మరో మ్యూజియం ఏర్పాటుకు రక్షణ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సమావేశంలో వెల్లడించారు. ఏపీటీడీసీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో హోటళ్లను, రిసార్టులను నిర్వహిస్తోందని, అయితే చాలా రోజులగా నిర్వహణ కోసం కనీస నిధులు కూడా ఇవ్వకపోవడంతో సమస్యలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వీటి మరమ్మత్తులు చేపట్టి, నిర్వహణ మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు.

హస్తకళలు అంతరించిపోకుండా చర్యలు తీసుకోండి
ష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న హస్తకళలు అంతరించిపోకుండా వాటిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేసుల తయారీ, కళంకారీ తదితర అరుదైన హస్తకళలు చేస్తున్న కుటుంబాలవారికి సహాయం చేసేలా మార్గదర్శకాలు తయారుచేయాలన్నారు. లేకపోతే ఆ కళలు బతకవని, వాటిని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అలాగే రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, వాటిని సరిగ్గా నిర్వహించడానికి ఆర్కియాలజీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరిలో మరలా బోట్లను తిప్పడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. నదీతీరాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుపై  ఈ సందర్భంగా సీఎం ఆరాతీశారు. నిర్దిష్టమైన నిర్వహణా పద్ధతులు, కంట్రోల్‌ రూమ్స్‌ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు సరైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

దీనికోసం ఏర్పాటైన  కమిటీ నివేదిక రాగానే సిఫార్సులపై చర్చిద్దామని సీఎం చెప్పారు. శిల్పారామాల్లో ప్రస్తుత పరిస్థితిపైనా సీఎం సమీక్ష చేశారు. ప్రస్తుతం ఉన్న శిల్పారామాల అభివృద్ధి, వాటిలో గ్రీనరీని పెంచడంపై సీఎం అధికారులకు సూచించారు. శిల్పారామాల నిర్వహణకు ఇబ్బందిలేకుండా నూతన విధానాన్ని తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కల్చరల్‌ అకాడమీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. కనీసం ఐదెకరాల స్థలంలో ఈ అకాడమీలను నిర్మించాలని, రెండేళ్లలోగా వీటిని పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్‌ అకాడమీలు వేదిక కావాలన్నారు. మన కళలను, సంస్కృతిని నిలుపుకోవడానికి, వాటి ప్రాముఖ్యత పెంచడానికి ఈ అకాడమీలు ఉపయోగపతాయని సీఎం అన్నారు. సంగీత, నృత్యకళాశాలలో బోధిస్తున్న పార్ట్‌టైం, ఫుల్‌టైం వారికి జీతాలు పెంచాలని కూడా సీఎం ఆదేశించారు.  

జిల్లాకో క్రీడా సముదాయం 
రాష్ట్రంలో క్రీడలు, సదుపాయాలపైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్షించారు. ప్రతి స్కూళ్లో క్రీడల కోసం మైదానం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లకు ప్లే గ్రౌండ్స్‌ ఉన్నాయి..? ఎన్నింటికి సమాకూర్చాలన్న దానిపై నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. అలాగే ఉన్న ఆటస్థలాల అభివృద్దిపై కూడా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అలాగే ఫిజికల్‌ ట్రైనర్లు ఉన్నారా? లేదా? అనేదానిపై కూడా పరిశీలనచేసి, నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణం
విశాఖపట్నం, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణంపై సమావేశంలో చర్చ జరిగింది. అంతర్జాతీయ సదుపాయాలతో స్టేడియంల నిర్మాణానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతిజిల్లాలో కూడా ఒక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఉండాలని వీటికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని స్పష్టంచేశారు.  ప్రతి జిల్లాలో కూడా క్రీడా సముదాయాల కారణంగా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ఏవిధంగా ప్రోత్సహించాలి, వారికి ఎలా అండగా నిలబడాలన్నదానిపై కూడా ప్రతిపానదలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. గడచిన ఐదేళ్లలో జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన గతంలో ఎప్పుడూ చేయలేదని, ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం చెప్పారు.  ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాలశాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఆ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top