ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్పొరేట్ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు.
హిందూపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్పొరేట్ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. శుక్రవారం హిందూపురంలో జరిగిన ఏఐటీయుసీ డివిజన్‌స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపాలన ‘కొత్తసీసాలో పాతసారా’ చందంగా మారిందన్నారు. కార్పొరేట్ శక్తులను కాదని ముఖ్యమంత్రి సొంతనిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు. రాయలసీమను, అందునా నిత్యం కరువుకాటకాలు సంభవించే అనంతపురం జిల్లాను విస్మరించి నవ్యాంధ్రలో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తగదని హితవు పలికారు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో పారిశ్రామికాభివృద్ధి ప్రకటనలకే పరిమితమైందన్నారు.
ఇప్పటివరకు ఇక్కడకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయని ప్రశ్నించారు. అభివృద్ధి విజయవాడకే పరిమితం కాకుండా అనంతపురానికీ వికేంద్రీకరణ కావాలాన్నారు. కదిరి, ఓడీసీ ప్రాంతాల్లో సోలార్‌హబ్ ఏర్పాటు చేయలన్నారు. కేంద్రప్రభుత్వం కూడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఇరుక్కుపోయిందన్నారు. పెట్రో, రైల్వేచార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో కూడా పాలన ఏకపక్షంగా ఉంటోందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే స్టోర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, కేబుల్ కనెక్షన్లు ఇలా ఆదాయవనరులన్నీ పచ్చచొక్కాలకే కట్టబెడుతున్నారన్నారు. కార్మిక సమస్యలపై ఈ నెల 25న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి జాఫర్, కౌన్సిలర్ దాదాపీర్, మండల కార్యదర్శి సురేష్, మాజీ కౌన్సిలర్ ఆషియాభాను, ఏఐటీయుసీ నాయకులు శ్రీరాములు, జయరాం, ఏఐవైఎఫ్ నాయకులు వెంకటేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.