కాన్వాయ్‌.. బాబోయ్‌..

CM Conway Bills Pendiong Worried Transports - Sakshi

రూ.1.21 కోట్లు పేరుకున్న వాహన అద్దెలు

‘నారా’ వారి కారు బకాయిలు రూ.58 లక్షలు

నాలుగేళ్లుగా చోద్యం చూస్తున్న అధికారులు

ఆత్మహత్యే శరణ్యమంటున్న నిర్వాహకులు

జిల్లాకు తరచూ ప్రముఖులు వస్తుంటారు. కలియుగ దైవం వెంకటేశుడు ఇక్కడ వెలియడంతో అన్ని ప్రాంతాల నుంచి వీఐపీల నుంచి తాకిడి ఎక్కువ. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ పర్యటిస్తుంటారు. ఆయనిచ్చే హామీల మాటెలా ఉన్నా అద్దె వాహన శ్రేణి (కాన్వాయ్‌)కయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది. వాహనాలు సమకూర్చాలంటే ట్రావెల్‌ ఏజెన్సీ వారు హడలిపోతున్నారు. సీఎం పర్యటనంటే ముచ్చెమటలు పడుతున్నాయి. నాలుగేళ్లుగా రూ.1.21 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి.

చిత్తూరు అర్బన్‌: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే చిత్తూరు ప్రత్యేకం. ప్రపంచంలోని కోట్లాది మంది ఆరా ధ్య దైవం శ్రీనివాసుని ఆలయమిక్కడే ఉంది. దీంతో మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీఐపీలు వచ్చినప్పుడు వారికి కనీస మర్యాదగా కాన్వాయ్‌ ఏర్పాటు చేయడం తప్పనిసరి. వీరితో పాటు మన సీఎం, ఆయన మంత్రివర్గం, టీడీపీ ప్రముఖులు, సీఎం కుటుంబ సభ్యులు.. ఇలా చాలా మందికి నాలుగేళ్లకుపైగాకాన్వాయ్‌ సమకూర్చి అద్దె వాహన నిర్వాహకులు అప్పులపాలైపోయారు.

చంద్రబాబు టాప్‌..
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో 2014లో 12 మార్లు జిల్లాకు వచ్చారు. కాన్వాయ్‌కు రూ.3.75 లక్షలు బకాయిలు మిగిలిపోయాయి. 2015లో 14 సార్లు రావడంతో రూ.13.32 లక్షలు చెల్లించాల్సి ఉంది. 2016లో 13 సార్లు రావడంతో 18.78 లక్షలు బకాయి ఉంది. గతేడాది తొమ్మిది సార్లు పర్యటించారు. ఇందుకోసం రూ.16లక్షలు ఇంకా చెల్లించలేదని వాహన శ్రేణి ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 18 సార్లు రావడంతో రూ.10 లక్షల బకాయి పేరుకుపోయింది. సీఎం సతీమణి హోదాలో నారా భువనేశ్వరి, మంత్రి పదవి రాకమునుపే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్‌కు, మంత్రి పదవి వచ్చాక ఐటీ మంత్రిగా.. అధికారిక కార్యక్రమాలతో పాటు పండుగలు, పబ్బాలు, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల వివాహాలు, కొందరు నేతలు చనిపోయినప్పుడు ఇలా పలుమార్లు సీఎం కుటుంబ సభ్యులు జిల్లాకు వచ్చినప్పుడల్లా కాన్వాయ్‌లకు బకాయి పడ్డారు.

ఎందరో మహానుభావులు...
ఏ రాష్ట్రానికారాష్టం వీఐపీ కాన్వాయ్‌ బకాయిలు చెల్లించాల్సిందే. సీఎంతో పాటు సింగపూర్‌ మంత్రులు, రాష్ట్ర గవర్నర్, ప్రధాన మంత్రి, శ్రీలంక అధ్యక్షులు, శ్రీలంక ప్రధాన మంత్రి, తమిళనాడు, మేఘాలయ గవర్నర్లు, రాష్ట్ర డెప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి, రవాణశాఖ మంత్రి, పశు సంవర్థక శాఖమంత్రి, కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు జిల్లాకు వచ్చినప్పుడు కాన్వాయ్‌లు ఏర్పాటు చేస్తే చిల్లిగవ్వ విడుదల కాలేదు.  పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కోసం అధికారులు దబాయించి మరీ కాన్వాయ్‌ పెట్టించుకుంటున్నారు.

వేధింపులు..
వీఐపీల పర్యటనకు కాన్వాయ్‌ సమకూర్చే బాధ్య త జిల్లా రవాణాశాఖ చూస్తోంది. కలెక్టర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగే అధికారులు తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల నుంచి అద్దె వాహనాలను సమకూరుస్తారు. అందరి వద్ద తమ జుట్టు చిక్కుకోకుండా తిరుపతిలోని ఓ ట్రావెల్‌ ఏజెన్సీని ముందుకు నెట్టి ప్రతిసారి అధికారులు తప్పించుకుంటున్నారు. ప్రముఖుల పర్యటన పూర్తయిన తరువాత నెల రోజుల్లో వాహనాలకు అద్దె చెల్లిస్తామని చెప్పడం.. ఆపై చేతులు దులుపుకోవడం అలవాటైపోయింది. పెట్టలేమని ఏజెన్సీవారు చెబితే పోలీసులతో చెప్పి కేసులు పెట్టిస్తామని అధికారులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఇది చాలదన్నట్లు కాన్వాయ్‌కు వెళ్లే డ్రైవర్ల ఇళ్ల వద్దకు పోలీసులు విచారణ పేరిట అర్ధరాత్రులు వెళ్లడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పగటిపూట రాకుండా అర్ధ రాత్రులు మందీ మార్బలంతో వస్తే చుట్టుపక్కల పరువుపోతోందని డ్రైవర్లు వాపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top