అడిగిన వెంటనే పరిశ్రమలకు భూములు

CM Chandrababu Mandate to the Collectors Conference - Sakshi

     కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం 

     మనమే పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్లి పిలవాలి  

     పరిపాలనపై ప్రజల సంతృప్త స్థాయిని 80% పెంచడమే లక్ష్యం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అడిగిన వెంటనే భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కోరగానే ప్రభుత్వ భూములను అప్పగించాలన్నారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసిన తక్షణమే వారికి ఏపీఐఐసీ భూములు కేటాయించాలని, ఏమాత్రం జాప్యం చేయరాదని పేర్కొన్నారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసం వద్దనున్న గ్రీవెన్స్‌ హాల్‌లో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు.

సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుత ఫలితాలు సాధించిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే 2029 కంటే ముందే మన రాష్ట్రం తిరుగులేని శక్తిగా ఆవిష్కృతమవుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వంద శాతం డిజిటల్‌ లిటరసీ సాధించాలని సూచించారు. ‘‘పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు వచ్చి మనల్ని భూములు, సౌకర్యాలు అడగడం కాదు. మనమే వారి వద్దకు వెళ్లి మేం ఇవి ఇస్తాం, మీరు పరిశ్రమలు పెట్టండి అని పిలవాలి’’ అంటూ ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విడుదలలో జాప్యం చేయరాదన్నారు. చంద్రబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

‘‘రాష్ట్రంలో లక్ష హోటల్‌ గదుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలి. హోటల్‌ గదులు మనం నిర్మించాలి. నిర్వహణ బాధ్యతలను ప్రముఖ సంస్థలకు అప్పగించాలి. మనం కష్టపడి రూపొందించిన ఈ–ప్రగతి, ఫైబర్‌ నెట్‌ లాంటి వాటిని మేధో హక్కుల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. పరిపాలనపై ప్రజల సంతృప్త స్థాయిని ప్రస్తుతం ఉన్న 75 శాతం నుంచి 80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు, ఎయిర్‌స్ట్రిప్, పరిశ్రమ కోసం 5,000 ఎకరాలు సేకరించాలి.

విజయవాడ శివారులోని జక్కంపూడిలో 106 ఎకరాలు, నున్నలో 70 ఎకరాలు, త్రిలోచనపురంలో 40 ఎకరాలను సేకరించండి. టౌన్‌షిప్‌లు నిర్మిద్దాం. గోదావరి జిల్లాలోని తిమ్మాపురంలో ఎకనామిక్‌ సిటీ నిర్మిద్దాం. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి వెంటనే భూసేకరణకు వెళ్లండి. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అవసరమైన భూసేకరణపై దృష్టి పెట్టండి. కేవలం పథకాలను అమలు చేస్తే సరిపోదు. వాటి గురించి ప్రజలకు తెలియజేయాలి. ఇందుకోసం డబ్బు ఖర్చు అవుతుందని వెనుకడుగు వేయాల్సిన పనిలేదు. 

200 గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ 
2019 మార్చి నాటికి 19 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆ తరువాత మరో 20 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంది.  దేవాదాయ స్థలాలను వేలం వేసి, పేదలకు ఇవ్వాలి. భవిష్యత్‌లో ఎండోమెంట్‌ భూములను కాపాడలేం. ఇప్పుడే పేదలకు పంపిణీ చేస్తే బాగుంటుంది. పట్టణాల్లో పేదలు ప్రైవేట్‌ స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి 200 గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి గృహాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. క్రీడలు నిరంతర ప్రక్రియగా ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలి. నిరుద్యోగ భృతిని వచ్చే నెల నుంచి అందించాలని నిర్ణయించాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

చెరువులను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి ప్రయోజనార్థం చెరువు భూమిని వేస్ట్‌ల్యాండ్‌గా మార్చడం సరికాదేమో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ సూచించారు. అయితే గత ఏడాది మా జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా శాంక్షన్‌ కాలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అర్బన్‌ హౌసింగ్‌పై చర్చ జరుగుతున్నప్పుడు లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని మునిసిపల్‌ అర్బన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ముఖ్యకార్యదర్శి కరికాలవలవన్‌ చెప్పగా మంత్రి ఈ వ్యాఖ్యాలు చేశారు. దీనిపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ.. 2016–17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గృహాలను జిల్లాకు కేటాయించలేదన్నారు.   

మద్యం బెల్ట్‌ షాపులను నియంత్రించాలి 
రాష్ట్రంలో మద్యం బెల్ట్‌ దుకాణాలు ఇంకా కొనసాగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు నొక్కి చెప్పారు. బెల్ట్‌ షాపులను పూర్తిగా నియంత్రించేందుకు ఎక్సైజ్, పోలీసు అధికారులతోపాటు కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ల సదస్సులో, తర్వాత శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమీక్షలోనూ సాంబశివరావు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.  

ఆధార్‌ డేటా వాడితే క్రిమినల్‌ చర్యలు
విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్‌) డేటాను బహిర్గతపరచడం చట్టరీత్యా తీవ్ర నేరమని ఆధార్‌ అథారిటీ ఛైర్మన్‌ జె.సత్యనారాయణ తెలిపారు. ‘‘ఆధార్‌కు సంబంధించిన డేటా ఎక్కడైనా వెబ్‌సైట్లలో ఉంటే వెంటనే తొలగించండి. ఆధార్‌ వివరాలు వెబ్‌సైట్‌లో ప్రదర్శించినా, బహిరంగ పరిచినా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని కలెక్టర్ల సదస్సులో సత్యనారాయణ స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top