బీసీలకు వెన్నుపోటుపై చంద్రబాబు కప్పదాటు

CM Chandrababu comments on BC lawyers issue - Sakshi

టీడీపీ హయాంలో జడ్జిలైన వారే తమను విమర్శిస్తున్నారని దాటవేత 

సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ వర్గాలకు చెందిన న్యాయవాదులకు విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వం లేదని, సచ్చీలురు కాదని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి లేఖ రాసి, వారు హైకోర్టు జడ్జిలు కానివ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడ్డారని, బడుగు వర్గాలకు చెందిన న్యాయవాదులకు వెన్నుపోటు పొడిచారని హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జడ్జిలైన వారు తనను విమర్శిస్తున్నారని అన్నారు. అంతేతప్ప తాను బీసీ న్యాయవాదులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపలేదని మాత్రం చెప్పకపోవడం గమనార్హం. చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణిని తాను వ్యక్తిగతంగానే టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమించానని స్పష్టం చేశారు.

గవర్నర్‌ ఢిల్లీ వెళితే అనుమానాలు రావా?  
బీజేపీ, వైఎస్సార్‌సీపీ కలసి తనపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. టీడీపీని ఎందుకు వదులుకున్నారో ఎన్డీఏ చెప్పాలన్నారు. తనకు రక్షణ కవచంగా ఉండాలని ప్రజలను కోరలేదనీ, చురుగ్గా పనిచేసే అధికారులపై కేసులు పెడతారని పత్రికల్లో రాస్తున్నారనీ, ఇలాంటి పరిస్థితుల్లో వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పానన్నారు. తనకు రక్షణ కవచంగా ఉండమని చెప్పలేదన్నారు. గవర్నర్‌ వ్యవస్థ వల్ల టీడీపీ ఇబ్బంది పడిందనీ, ఇప్పుడు కూడా తనను కలిశాక గవర్నర్‌ ఢిల్లీ వెళితే అనుమానాలు రావా? అని ప్రశ్నించారు.  

అది అతి తెలివి  
కేంద్ర ప్రభుత్వం చాలా నాటకాలాడుతోందనీ, తమిళనాడులో మాదిరిగా ఇక్కడా చేయాలని చూస్తోందని బాబు అన్నారు. మన రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారు గుణపాఠం చెప్పాలని కోరారు. సీబీఐ తనపై కేసులు పెడుతుందనే పుకార్లు వస్తున్నాయనీ నిప్పు లేకుండా పొగ రాదంటూ తనపై కేసులు పెట్టినా ఆశ్చర్యం లేదన్నారు. ‘అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేస్తే ఎలా? అది తెలివి కాదు, అతి తెలివి’’అని చంద్రబాబు కేంద్రాన్ని విమర్శించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top