ట్రావెల్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి | chiranjeevi seek stern action on private travel mafia | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి

Nov 15 2013 11:47 PM | Updated on Sep 2 2017 12:38 AM

ట్రావెల్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి

ట్రావెల్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి

ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను అరికట్టడానికి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

సీఎంకు కేంద్ర మంత్రి చిరంజీవి లేఖ
 
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను అరికట్టడానికి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులు వరుసగా మంటల్లో చిక్కుకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు బస్సుల్లో ప్రయాణించే వారిలో మరింత అభద్రతాభావాన్ని కల్గిస్తాయని తెలిపారు. మాఫియాలా మారిన ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఉక్కుపాదం మోపాలని కోరారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తన అభిమాన సంఘ నాయకుడొకరు, ఆయన సోదరి సజీవదహనం అయ్యారని లేఖలో ప్రస్తావించారు. బస్సు దుర్ఘటనలో అసువులు బాసిన వ్యక్తుల కుటుంబాల వారి వేదన, రోదన ఏ ఒక్కరూ తీర్చలేనిదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయగలడమే మన మందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు ఆర్టీసీ తగినన్ని బస్సులు నడపకపోవడం వల్లే ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే బస్సు యజమానులు నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలపై ప్రభుత్వ తీరుపైనా మండిపడ్డారు. ‘‘ప్రమాదాలు జరిగినప్పుడు రవాణ శాఖ అధికారులు సాధారణంగా చేసే దాడులు, బస్సులను స్వాధీన పరుచుకోవడం వంటి చర్యలు కొన్ని రోజుల వరకే పరిమితం కావడం.. ఆ తర్వాత మళ్లీ పాత కథ పునరావృతం కావడం సర్వసాధారణంగా మారింది’’ అని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను నియంత్రించాలని సీఎంను కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement