‘ఖైదీ నంబర్‌ 150’ టిక్కెట్‌ దొరకలేదని...

‘ఖైదీ నంబర్‌ 150’ టిక్కెట్‌ దొరకలేదని...

 • విశాఖలో గొంతుకోసుకున్న యువకుడు

 • చికిత్స పొంది సాయంత్రం సినిమా చూసిన వైనం

 • గుంటూరు జిల్లాలో బెనిఫిట్‌ షో ఆలస్యం కావడంతో థియేటర్‌ ధ్వంసం

 • హద్దులు దాటిన అభిమానం • సాక్షి, విశాఖపట్నం/కొల్లూరు(వేమూరు): అభిమాన కథానాయకుడు నటించిన చిత్రాన్ని తొలిరోజే చూడాలన్న ఆరాటంతో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సినిమా టిక్కెట్‌ దొరక లేదన్న అసహనంతో గొంతు కోసుకున్నాడు. మరో ఘటనలో.. చెప్పిన సమయానికి సినిమాను ప్రదర్శించలేదని ఆగ్రహించిన అభిమానులు థియేటర్‌పై దాడి చేశారు. దీంతో థియేటర్‌ స్క్రీన్‌ చిరిగిపోయింది. కుర్చీలు ముక్కలయ్యాయి. తలుపులు పగిలిపోయాయి.  మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రం బుధవారం విడుదలైంది. విశాఖపట్నంలో తొలిరోజే సినిమాను చూడాలన్న ఆశతో యువకుడు నాగరాజు స్థానిక రామా టాకీస్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే టిక్కెట్లు అయిపోయాయని థియేటర్‌ నిర్వాహకులు చెప్పారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా టిక్కెట్‌ దొరక్కపోవడంతో అసహనానికి గురైన నాగరాజు బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో చికిత్స అనంతరం మళ్లీ థియేటర్‌ వద్దకు వచ్చి టిక్కెట్‌ తీసుకుని సినిమా చూసి వెళ్లాడు.  థియేటర్‌ స్క్రీన్, కుర్చీలు ధ్వంసం  గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో స్థానిక శ్రీనివాస టాకీస్‌ నిర్వాహకులు ‘ఖైదీ నంబరు 150’ బెనిఫిట్‌ షో ప్రదర్శిస్తామంటూ ముందుగానే టిక్కెట్లు విక్రయించారు. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటలకే ప్రదర్శన ఉంటుందని చెప్పారు. టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తీరా లోపలికి వెళ్లగా, ఖైదీ నంబరు 150కి బదులు వేరే డబ్బింగ్‌ చిత్ర ప్రదర్శన ప్రారంభించారు. అభిమానులు ఆందోళనకు దిగడంతో నిర్వాహకులు ఆ సినిమా ప్రదర్శన నిలిపివేశారు.  చిరంజీవి చిత్ర ప్రదర్శనకు సంబంధించిన డిజిటల్‌ లాక్‌ చేరడం ఆలస్యమైందంటూ కాలం గడిపారు. తెల్లవారుజామున నాలుగున్నర వరకూ అభిమానులు ఓపిగ్గా ఎదురుచూశారు. ఈలోగా ఇతర ప్రాంతాల్లో చిత్ర ప్రదర్శన ప్రారంభమైందంటూ సమాచారం అందడంతో సహనం కోల్పోయారు. కుర్చీలు, థియేటర్‌ తలుపులు, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా థియేటర్‌లోనే టపాసులు పేల్చుతూ, కుర్చీలను స్క్రీన్‌ పైకి విసురుతూ పూర్తిగా చించివేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి, అభిమానులను చెదరగొట్టారు. ఈ ఘటనలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు థియేటర్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top