
గుప్త నిధుల కోసం చిన్నారి బలి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన చందు(6) గుప్త నిధుల వేటగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యూడు.
- అనంతపురం జిల్లాలో దారుణం
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన చందు(6) గుప్త నిధుల వేటగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యూడు. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన శనివారం మధ్యాహ్నం వెలుగు చూసింది. నిరుపేదలైన తల్లిదండ్రులు తిరుపాలమ్మ, నందవారప్పలు తెలిపిన వివరాల మేరకు.. చందు రోజూ మాదిరిగానే సోమవారం పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం విరావు సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కళ్యాణదుర్గం రూరల్ పోలీసు స్టేషన్‌లో అదే రోజు రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కుర్లపల్లి - కొత్తూరు రహదారి సమీపంలో ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి గోతిలో పాతిపెట్టిన మృతదేహాన్ని కుక్కలు వెలికితీశాయి. తల్లిదండ్రులు, గ్రామస్తులు అది చందు మృతదేహమేనని నిర్ధారించారు. చందు రెండు కాళ్లు, కుడి చేరుు, కుడి కన్ను తొలగించి ఉండటం, సోమవారం అమావాస్య కావడం, 12 ఏళ్లకు పుట్టిన ఏకైక సంతానం కావడంతో ఇది గుప్త నిధుల కేటుగాళ్ల పనేనని గ్రామస్తులు చెబుతున్నారు.