పీటలపై పుత్తడి బొమ్మలు

Child Marriages Controlling In Krishna District - Sakshi

పాలబుగ్గల పసిపిల్లలు పుత్తడి బొమ్మలుగా మారుతున్నారు. పేదరికం...నిరక్షరాస్యత..కుల కట్టుబాట్లు... గతించిన సంప్రదాయలు.... అభంశుభం తెలియని ఆడపిల్లల జీవితాలను బలి చేస్తున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులను పెళ్లి పీటలు ఎక్కించడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వందలాది బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి.

వారు పసి మొగ్గలు. స్నేహితుల ఆటపాటలతో సంతోషాల సాగరంలో ఓలలాడే ఉల్లాసజీవులు. అక్షర వర్ణమాల వ్యాకరణాలతో కుస్తీ పట్టే చిరు దివ్వెలు. ప్రతి ఇంటా సిరులు కురిపించే సౌభ్యాగ్య ప్రదాయినిలు. అటువంటి అభం శుభం తెలియని ఆ చిట్టి చేతులను ఓ అయ్య చేతిలో పెట్టి పెళ్లిళ్లు చేసేస్తూ వారిని నరకప్రాయంలోకి నడిపిస్తున్నారు. 

సాక్షి, మచిలీపట్నం : నిరుపేద కుటుంబంలో పాప పుట్టడం చేసిన పాపమో.. సాకలేక  ఓ అయ్య చేతిలో పెట్టడం అమ్మానాన్నల నేరమో.. సంప్రదాయం మాటున అజ్ఞానమో.. కారణాలు ఏవైనా కావచ్చు జరుగుతున్నవి మాత్రం ఘోరాలే.. ఇందుకు జిల్లాలో గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతుంది. జిల్లాలో ఏటా అనధికారికంగా 100 నుంచి 150 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వాటిలో వెలుగులోకి వచ్చినవి మాత్రం 80 నుంచి 100కు లోపే ఉంటున్నాయి. మిగిలినవి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తంతు. 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే 457 వివాహాలను ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళల్లో పెళ్లి చేసే వయస్సును అంతర్జాతీయ సంస్థలు ఒక అధ్యయనం ప్రకారం 18 ఏళ్లుగా నిర్ణయించారు. అంతకు తక్కువ వయస్సులో వివాహం జరిపిస్తే శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేక బహుళ నష్టాలు కలుగుతాయని అంతర్జాతీయ ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి. బాలికల్లో ఆరోగ్య క్షీణత, పుట్టుకతోనే పిల్లల్లో లోపాలు వస్తాయి. ఇది తర్వాతి తరాలైనా ప్రభావం చూపుతాయని తెలిసినా పెళ్లిళ్లు జరగడం విస్మయం కలిగిస్తోంది. 

ఏయే ప్రాంతాల్లో ఎక్కువంటే.. 
జిల్లా వ్యాప్తంగా అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, మైలవరం, కైకలూరు నియోజకవర్గాల పరిధిలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల పరిధిలో మత్స్యకార కుటుంబాలు, గిరిజన తండాలు, మరికొన్ని బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో ఇప్పటికీ బాల్య వివాహాల ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. 

కారణాలు అనేకం..!
పేదరికం, ఆడ పిల్లలను భారంగా భావించడం, పెద్దల నిరక్షరాస్యత కారణంగా పిల్లలను చదివించాలనే తలంపు లేకపోవడం, అనర్థాలపై అవగాహన లేకపోవడంతో జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా జరగడానికి కారమణమవుతున్నాయి. దీనికి  గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలు పావులుగా మారుతున్నారు. వారి తల్లి దండ్రులు పిల్లలను పోషించే స్థోమత లేకపోవడంతో ఏదో పెళ్లి చేసేయాలనే ఆలోచన చేస్తున్నారు. నాగాయలంక, కోడూరు, బందరు, కైకలూరు, లంక ప్రాంతాల్లో నివశించే వారిలో ఈ తరహా అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరక్షరాస్యత, కులవృత్తిపై ఆధారపడే కుటుంబాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా  జరుగుతున్నాయి. 

కైకలూరు  మండలం కొల్లేరుకు చెందిన 16 ఏళ్ల బాలికను గూడూరు మండలం రాయవరం గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసున్న వ్యక్తికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. బందరు మండలం చిన్నాపురం గ్రామంలోని బాలిక నానమ్మ ఇంటి వద్ద పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం కాస్త ఐసీడీఎస్‌ అధికారులకు తెలియడంతో అక్కడికి చేరుకున్న సీడీపీవో దీప్తి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఎస్‌ఐ శ్రీనివాస్, సర్పంచ్, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ జాహేదాలు వివాహాన్ని అడ్డుకుని.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇలాంటి ఘటన కేవలం ఇదొక్కటే కాదు.. జిల్లా వ్యాప్తంగా నిత్యకృత్యంగా మారాయి. 

విధిగా సమాచారమివ్వాలి
బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే మనకెందుకు అని ఊరుకోకుండా విధిగా పోలీసులు, బాలిక సంరక్షణ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వివాహం జరిగిపోయిన తర్వాత కూడా బాలిక సంరక్షణ అధి కారులకు సమాచారం అందిస్తే.. ఆ వివాహాన్ని రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంది. జిల్లా మెజిస్ట్రేట్‌ నిలిపివేత ఉత్తర్వులు ద్వారా వివాహాన్ని రద్దు చేయవచ్చు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు సెక్షన్‌ 151/సీఆర్‌పీసీ ప్రకారం దర్యాప్తు ఆరంభించాలి. బలవంతంగా వివాహం చేస్తున్నట్లు తేలితే కఠిన చట్టాలు అమల్లోకి వస్తాయి. బాల్యవివాహాల నిర్మూలనకు 2006లో వచ్చిన చట్టంలోని సెక్షన్‌ 18 ప్రకారం పెద్దలు, సంరక్షకులు, పెళ్లికి అంగీకరించిన వరుడు, సాక్షులు అందరూ శిక్షార్హులే.  కఠిన చట్టాలు అమల్లో ఉన్నా బాల్యవివాహాల నిర్మూలనపై  ప్రచారం జరగడం లేదు. 

అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలో బాల్య వివాహాల నివారణకు కృషి చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేసి వివాహాలను అడ్డుకుంటున్నాం. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
–కృష్ణకుమారి, ఐసీడీఎస్‌ పీడీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top