‘పోలవరం’లో నామినేషన్‌దే డామినేషన్‌

Chandrababu Used Polavaram Project As ATM - Sakshi

కీలక ప్రాజెక్టును ‘ఏటీఎం’గా మార్చుకున్న చంద్రబాబు

నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కగానే పనుల అంచనా వ్యయం భారీగా పెంపు 

కాంట్రాక్టర్లపై వేటు వేసి, అస్మదీయులకు నామినేషన్‌పై పనులు అప్పగింత

హెడ్‌ వర్క్స్‌లోనే నామినేషన్‌ పద్ధతిలో రూ.3489.93 కోట్ల పనులు 

ఎడమ కాలువలో రూ.2,850 కోట్లకుపైగా పనులు టీడీపీ నేతల చేతికి

గరిష్ట లబ్ధిదారుల్లో యనమల వియ్యంకుడు పుట్టా, నామా, బీఎస్సార్‌

సాక్షి, అమరావతి: తెలుగు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి శాశ్వత ధాన్యాగారంగా నిలిపే సత్తా ఈ ప్రాజెక్టుకు ఉంది. ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నడుం బిగించారు. 2005లో జలయజ్ఞం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు దాదాపుగా అన్ని అనుమతులు తీసుకొచ్చారు. పనులను వేగవంతం చేశారు. 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తన అక్రమార్జనకు అక్షయపాత్రగా మార్చుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా(ఎనీ టైమ్‌ మనీ) మారింది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించి ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న తర్వాత అంచనా వ్యయాన్ని పెంచేశారు. పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి, కమీషన్‌లు ఇచ్చే కాంట్రాక్టర్లకు నోటి మాటపై ఏకంగా రూ.7,984.93 కోట్ల విలువైన పనులు అప్పగించేశారు. ఆ తర్వాత వాటిపై మంత్రివర్గంతో ఆమోదముద్ర వేయించారు. ఈ అక్రమాలపై నిలదీస్తే.. ‘పాత’ ధరలకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారని, అందుకే వాటిని నామినేషన్‌ పద్ధతిలో అప్పగించామని బుకాయించారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి, తాజా ధరల కంటే అధికంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి భారీ ఎత్తున కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. 

జలాశయం పనులన్నీ నామినేషన్‌పైనే...
పోలవరం జలాశయం(హెడ్‌ వర్క్స్‌) పనులను ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విధానంలో రూ.4,054 కోట్లకు 2013 మార్చి నెలలో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ(జాయింట్‌ వెంచర్‌) దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2018 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలి. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం పనులు చేసే సత్తా లేదని, ఆ సంస్థకు పనులు ఎలా అప్పగిస్తారంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాద్ధాంతం చేశారు. కానీ, 2014 ఎన్నికల ముందు రాయపాటి తెలుగుదేశం పార్టీలో చేరడంతో చంద్రబాబు పల్లవి మార్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తే కమీషన్‌లు వసూలు చేసుకోలేమని భావించిన చంద్రబాబు ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కోరుతూ వచ్చారు. 
- ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికే కేంద్రం అప్పగించింది. ఆ మరుసటి రోజే పోలవరం హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.5,385.91 కోట్లకు చంద్రబాబు పెంచేశారు. కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియకుండానే అంచనా వ్యయం పెంచడం నిబంధనలకు విరుద్ధం. 
ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని హెడ్‌ వర్క్స్‌ పనులన్నీ ‘సబ్‌’ కాంట్రాక్టర్లకు అప్పగించి, 2018 ఫిబ్రవరి వరకూ వారు చేసిన పనులకు రూ.2,362.22 కోట్ల బిల్లులు చెల్లించి, టీడీపీ ప్రభుత్వ పెద్దలు కమీషన్‌లు వసూలు చేసుకున్నారు.
అధికారాంతమున అంటే 2018 ఫిబ్రవరి 17న భారీ ఎత్తున కమీషన్‌లు దండుకోవడం కోసం 60సీ నిబంధన కింద ట్రాన్స్‌ట్రాయ్‌ని తొలగించేసి.. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులను ఎల్‌ఎస్‌(లంప్‌సమ్‌)–ఓపెన్‌ విధానంలో రూ.3,102.37 కోట్లకు నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా, ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో మరొక కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. 
గేట్ల పనులను రూ.387.56 కోట్లకు బీకెమ్‌ సంస్థకు నామినేషన్‌పై అప్పగించేశారు. ట్రాన్స్‌ట్రాయ్, బీకెమ్‌ సంస్థలకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించిన పనుల విలువను పరిశీలిస్తే హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయం రూ.5,825.15 కోట్లు అవుతుంది. అంటే.. ఇప్పటికే సవరించిన అంచనా వ్యయం కంటే హెడ్‌ వర్క్స్‌ విలువ రూ.439.24 కోట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

కుడి, ఎడమలలో దోచేశారు
హెడ్‌ వర్క్స్‌ తరహాలోనే పోలవరం కుడి కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,240.86 కోట్ల నుంచి రూ.4,375.77 కోట్లకు, ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచేస్తూ 2016 డిసెంబర్‌ 6న ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఎడమ కాలువలో ఎనిమిది ప్యాకేజీల కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. కమీషన్‌లు ఇచ్చే అస్మదీయ కాంట్రాక్టర్లకు నామినేషన్‌పై పనులు అప్పగించారు. 
ఎడమ కాలువ 5వ ప్యాకేజీలో 2016 నవంబర్‌ 30 నాటికి రూ.110.11 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. కానీ, వాటి అంచనా వ్యయాన్ని రూ.142.88 కోట్లకు పెంచేసి అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు, టీడీపీ నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.669.40 కోట్లకు పెంచేస్తూ ఈ ఏడాది జనవరి 10న మళ్లీ సర్కార్‌కు ప్రతిపాదనలు పంపారు. అంటే పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు ఖజానా నుంచి రూ.559.29 కోట్లు అప్పనంగా దోచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. 
చంద్రబాబు సన్నిహితుడు నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్‌–సినో హైడ్రో సంస్థ పోలవరం ఎడమ కాలువ ఆరో ప్యాకేజీ పనులను రూ.196.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటికి రూ.112.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ఈ సంస్థకు ధరల సర్దుబాటు కింద రూ.11.45 కోట్లను అదనంగా ప్రభుత్వం చెల్లించింది. నామా నాగేశ్వరరావుకు చెందిన సంస్థ కావడంతో పనులు చేయకున్నా వేటు వేయలేదు. నిబంధనల ప్రకారం ఈ సంస్థపై  వేటు వేసి.. పనుల్లో జాప్యం వల్ల పెరిగిన అంచనా వ్యయంలో 95 శాతాన్ని ఆ సంస్థ నుంచి జరిమానాగా వసూలు చేయాలి. కానీ, నామా నాగేశ్వరరావు సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆరో ప్యాకేజీ పనులు చేయలేక నామా నాగేశ్వరరావు సంస్థ చేతులెత్తేసింది. దాంతో ఆ సంస్థపై వేటు వేయకుండా.. రూ.70.29 కోట్ల విలువైన పనులను 60సీ నిబంధన కింద తొలగించాలని అప్పటి సీఎం చంద్రబాబు సూచించారు. దాంతో రూ.13.43 కోట్ల విలువైన పనులు మాత్రమే నామాకు మిగిలాయి. 60సీ కింద తొలగించిన రూ.70.29 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచేసి, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతకు చెందిన బీఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించేశారు. నామా నాగేశ్వరరావు చేతిలో మిగిలిన రూ.13.43 కోట్ల పనుల విలువను రూ.119.81 కోట్లకు పెంచేశారు. అంటే నామాకు రూ.106.38 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. 
కుడి కాలువ పనుల్లో 6, 7వ ప్యాకేజీల్లో కేవలం రూ.34 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.185 కోట్లకు పెంచేసి.. వాటిని బొల్లినేని శీనయ్య సంస్థకు అప్పగించి, భారీగా కమీషన్‌లు కొల్లగొట్టారు. కుడి కాలువకు అనుబంధంగా 4 వరుసల రహదారి పనుల్ని రూ.174 కోట్లకు అదే సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టి కమీషన్‌లు తీసుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top