ఓట్లే అస్త్రం.. ఎన్నికలే లక్ష్యం

Chandrababu Naidu Pasupu Kunkuma Meeting in YSR Kadapa - Sakshi

పసుపు–కుంకుమ సమ్మేళనంలో బయటపడ్డ సర్కార్‌ లోగుట్టు

సీఎంతో సహా అందరి     ప్రసంగంలోనూ.. ఆదరించాలని వేడుకోలు

ఆవరణలో కూలిపోయిన టెంటు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

పదేపదే అడిగి చప్పట్లు     కొట్టించుకున్న నేతలు

ప్రత్యేక విమానంలో కడపకు సీఎం బాబు

కరువు సమస్యలను వివరించడానికి వస్తున్న సీపీఐ నేతల అరెస్టు

సాక్షి కడప : ఎన్నికలు దగ్గర పడేకొద్దీ టీడీపీ సర్కారును అలజడి వెంటాడుతోంది. 2014  ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేకపోయిన చంద్రబాబు సర్కార్‌ మరోసారి ఎన్నికల తాయిలాలకు సిద్ధమైంది. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని గద్దెనెక్కిన పెద్దలు తర్వాత మాట మార్చి ఆర్థిక కోరల్లో చిక్కుకున్నామని..ఒక్కొక్కరికి .పెట్టుబడి నిధి కింద రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించి అదీ కూడా మూడు విడతల్లో అందించడానికి నాలుగేళ్లు పట్టింది. ఇప్పుడు ఒక్కొక్కరికి రూ.10 వేలు అంటూ.. మూడు  విడతల్లో ఇస్తూనే సెల్‌ఫోన్‌ ఇస్తామని సీఎం బాబు ప్రకటన వెనుక సర్కార్‌ లోగుట్టు ఓట్లే అస్త్రం..ఎన్నికలే లక్ష్యం...అన్నది చెప్పకనే కళ్ల ముందు కనిపిస్తోంది.

అందులోనూ పసుపు కుంకుమ పేరుతో నిర్వహించిన డ్వాక్రా సదస్సులో ఆదరించాలంటూ...ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి..పథకాలు వివరించాలి...మళ్లీ మనమే రావాలి అని చెప్పడం వెనుక ఉన్న మర్మమేమిటో ఇట్టే తెలిసిపోయింది. అంతేకాదు ఎన్నికలకు ముందు ఇస్తున్న తాయిలాల రహస్యాలపై కూడా మహిళలు చర్చించు కోవడం కనిపించింది.  జిల్లాలోని మున్సిపల్‌ స్టేడియంలో సీఎం సభ సందర్బంగా టెంటు కూలిపోయింది. అక్కడ కుర్చీల్లో కూర్చొన్న మహిళలపై టెంటు పడడంతో ఒక్కసారిగా భయాందోళనలతో పరుగులు తీశారు. కొంతమంది మహిళలు కుర్చీలు తలపై పెట్టుకుని ప్రక్కకు పరుగులు లంకించుకున్నారు. అయితే టెంటు కూలినా ఎటువంటి ప్రమా దం జరగకపోవడంతో అటు అధికారులతోపాటు ఇటు అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఎన్నికల స్టంట్‌
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీకి నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా? అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంతవరకు చెప్పిన పథకాలకే కోతలు పెడుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు పెన్షన్ల పెంపు.. ఆటోలు, ట్రాక్టర్లు ట్యాక్సుల మినహాయింపు.. డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు, నగదు అందించడం వెనుక రహస్యమేమిటన్న చర్చ సాగుతోంది.  కేవలం ఎన్నికల స్టంట్‌గానే అందరూ అభివర్ణిస్తున్నారు. 

ఆదరించడం వెనుక అసలు రహస్యం
కడపలోని మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన పసుపు కుంకుమ సమ్మేళన సదస్సుకు రాయలసీమలోని నాలుగు జిల్లాతోపాటు నెల్లూరుజిల్లా మహిళలను కూడా పెద్ద ఎత్తున తరలించారు. సభ ప్రారంభమైన క్షణం నుంచి సీఎం చంద్రబాబు ముగించే వరకు ప్రసంగించిన ప్రతి ఒక్కరూ ఆదరించండి..అభిమానించండి...ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురండని అధికార సభలో మాట్లాడటం వెనుక ప్రభుత్వ అసలు రహస్యం బయటపడింది. ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి ప్రత్యేక సదస్సులు పెడుతున్నా అందులో కూడా టీడీపీ నేతలు బహిరంగంగానే ఓట్ల మాట మాట్లాడుతుండడం మహిళలతోపాటు అందరిలోనూ చర్చకు దారి తీస్తోంది. 

చెప్పిందే చెబుతూ....చప్పట్లు కోరుతూ.....
సీఎం బాబుతోపాటు పలువురు ప్రసంగించారు. అయితే సీఎం మాట్లాడుతున్న సందర్భంలో నేను చెప్పేది మీరు నిజమని విశ్వసిస్తున్నారా.. అయితే  చప్పట్లు కొట్టండి.. చేతులు పైకెత్తి మద్దతు తెలుపాలంటూ పదేపదే కోరడం కనిపించింది. అంతేకాకుండా బాబు ఎప్పుడు కడపకు వచ్చినా సాగునీటిని అందించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ చెప్పిందే చెప్పడంతో కూడా పలువురు అసహనంగా వెళ్లిపోయారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో కడపకు వచ్చారు. గుంటూరులో సభ ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఇక్కడకు వచ్చారు. కడప ఎయిర్‌పోర్టులో కలెక్టర్‌ హరి కిరణ్, డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ అభిషేక్‌ మహంతి తోపా టు పలువురు టీడీపీనేతలు స్వాగతం పలికారు.   సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు కడపకు చేరుకోవాల్సి ఉండగా, మూడు గంటల ప్రాంతంలో వచ్చారు. ఇక్కడ మహిళా సదస్సు ముగియగానే కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరి వెళ్లారు.

సీపీఐ నేతల అరెస్టు
జిల్లాలో కరువు సహాయక పనులు వెంటనే చేపట్టాలని,  చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు పాల కేంద్రం,నందలూరు ఆల్విన్‌ ఫ్యాక్టరీ, కెమికల్, సాల్వన్, కాటన్‌ ఆయిల్‌ మిల్లుల మూసివేతతో బజారున పడిన కార్మికులను ఆదుకోవాలని, ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం చంద్రబాబును కలవాలని   సీపీఐ నేతలు నిర్ణయించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం నాయకులు చంద్ర, వెంకట శివ, చంద్రశేఖర్‌ లను లోనికి వెళ్లకుండా అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top